పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 7

క్లుప్తమైనను, పెద్ద పెద్ద ఉద్యోగులను చూచి ఎరుకపడ వచ్చుననే ఉద్దేశముతో మండలములనుండి చిన్న ఉద్యోగులు పలువురు పనికట్టుకొని చెన్నపట్నమునకు వచ్చుట అలవాటు. బంధువులిచ్చటయున్నవారు కొందరు కుటుంబములతోనే వచ్చేవారు. ఇట్టిపై జనము వచ్చుటచేత ఈ వేడుకలకు విస్తారముగా ధనము వచ్చెడిది. మరియు అనేకవిధములగు వస్తువుల ప్రదర్శనమును, విక్రయమును జరిగెడిది.

ఈ ప్రదర్శనములకై ఏటేటా టెంకాయ ఆకులతో వెదురు బొంగులతో పెద్ద పెద్ద రెండు ఆవరణములను కట్టేవారు. మొదటిది లోపలి ఆవరణము (Inner Circle), రెండవది వెలుపలి ఆవరణము (Outer Circle), మొదటి ఆవరణములో వెలగల వస్తువులను ప్రదర్శించేవారు. రెండవ ఆవరణములో సోడా అంగళ్లు, లాటరీ అంగళ్లు, కాఫీ హోటళ్లు మొదలగు వాటిని ప్రదర్శింపజేయుదురు. దుండగీడులు మొదటి ఆవరణపు తడికలపైనెక్కి లోనికి దూకకుండ దానిని చౌకకొయ్యలతో దిట్టముగా కట్టేవారు. ఒక్కొక్క ఆవరణమునకు నాలుగుద్వారములుండేవి. ద్వారముల వద్ద పోలీసు కాప్దారీతోపాటు అంగళ్ల కంట్రాక్టరుల తాలూకు మనుష్యులు కూడా ఉండేవారు. వెలుపలి ఆవరణము లోనికి పోవుటకు అర్ధణా టిక్కట్టు; లోపలి ఆవరణమునకు పోవుటకు నాలుగణాలు యివ్వవలయును. మొదట అర్ధణా యిచ్చి, లోపలికి పోతేగాని నాలుగణాల ఆవరణమునకు పోవుటకు వీలుకాదు.

అప్పటికి యింకను మద్రాసులో ఎలక్ట్రిక్ దీపాలు ఏర్పడలేదు. రాత్రి వెలుతురు కొరకు కిర్సనాయిల్ పోసిన తగరపుబుడ్లను, అంగళ్లలోను, బయటను తోరణములుగా కట్టేవారు. ఆ నూనెదీపములను వెలిగించుట 5 గం||లకే ప్రారంభించినగాని, చీకటిపడునప్పటికి ముగియదు.