Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు141

ప్రహరిగోడల ప్రక్కన గోడ కనుపడకుండునట్లు మూడువరుసల పూలచెట్లను వేయించి పెంచితిని. మొదటి వరుస వంటిరెక్క దాసాని పూల చెట్లను, రెండవవరుస ముద్ద పువ్వులదాసాని పూలచెట్లను, మూడువరుస కాశీతుంబ (Balsam) చెట్లను వేసితిని. ఈ మూడువరుసల పూలచెట్లు పూచినప్పుడు పూలమెట్లవలె కాన్పించును. మొదటివరుస చెట్లు పొడవుగ పెరుగును. రెండవ వరుసచెట్లు పొట్టిగ గుబురుగపెరుగును. మూడవవరుస బాల్సం పూలచెట్లు ఒక అడుగు పొడవున మాత్రమే పెరిగి దట్టముగ పూలుపూయును. ఈ దృశ్యము కనులపండువుగ నుండును.

ఈ కడపటి పూలచెట్లు వరుసనుండి 10 అడుగుల మోటారు రోడ్డును వేయించితిని. ఈరోడ్డు ప్రక్కననే పొట్టి బంతిచెట్లను (French Marigold) నాటించితిని. రెండవ వరుస ప్లాక్సన్సు విదేశపూలచెట్ల వరుసను వేయించితిని. ఈ రెండువరుసల పూలమధ్యను విశాలమైన లాన్ (Lawn) యని పిల్వబడు గడ్డినేలను తయారుచేయించితిని. ఇది చూచునప్పుడు ఏలూరు రత్నకంబళివలె కాన్పించును. ఈ రత్నకంబళి నాలుమూలలను సైప్రస్ చెట్లను పెంచితిని. ఈ చెట్లు శాఖలులేక పచ్చగ గుబురుగ 50 అడుగుల వరకు పెరిగినవి. ఈ చెట్లను తలయెత్తి చూచినపుడు తమాషాగ నుండును.

ఈ సైప్రస్ చెట్లప్రక్కననే నాలుగుమూలలను సిమెంటుతో తయారుచేయబడిన అందమైన పెద్దపూతొట్లను కట్టించి అందులో వెర్బీనా (Verbeena)యను తీగపూల చెట్లను నాటితిని. ఈ చెట్టు పూచినప్పుడు తొట్టి కనబడకుండ చిక్కగ పూయును. తీగ నిండుగ పూలుపూచి వ్రేలాడునపుడు చూచిన చాలా అందముగ కనుబడును. ఎఱ్ఱ బిగోనియా (Bigonia) చెట్లతీగెలను సైప్రస్ చెట్ల నాలుగింటికిని తోరణముగ అల్లించితిని.