140 చిన్ననాటి ముచ్చట్లు
ప్రయోజకుడనైన పిమ్మట బెంగుళూరునందు ఒక యింటిని కొంటిని. ఇంటిచుట్టు దట్టముగ మామిడిచెట్లు, కొద్దిగ టెంకాయచెట్లు మొదలగునవి మాత్రమే యుండెను. నివసించు యింటిచుట్టు మామిడి చెట్లుండుటచే దోమలబాధను సహింపజాలకుంటిమి. మామిడిపండ్ల కాలములో సన్నదోమలు పగలుకూడ బాధించుచుండెను. ఈ కారణము వలన యింటి సమీపముననుండు కొన్ని మామిడిచెట్లను మాత్రము కొట్టివేయవలసి వచ్చెను. ఫలించు ఫలవృక్షములను నరికివేయుటకు మనసొప్పక పోయినను చేయక తప్పదాయెను. ఇంటివద్దనుండు మామిడిచెట్లను కొట్టివేయగనే నివసించు యింటిలోనికి మంచి వెలుతురు, గాలి, యెండ ప్రవేశింప దొడగెను. అప్పడు బాధించుచుండిన దోమలు మాయమాయెను.
బెంగుళూరు పట్టణము మంచి పూదోటలనువేసి పెంచుటకు అనుకూలమైన వాతావరణము గలదగుటచే అనేకులు యిండ్లచుట్టు పుప్పవనమును ఫలవృక్షములను వేసుకొని ఆనందించుట చూచితిని. ఆ తోటలను చూచినప్పటినుండియు నాకును అటువంటి తోటలను పెంచవలయుననే కోరిక కలిగెను. ఈ కోరిక కలుగగనే బెంగుళూరు లాల్ బాగ్ తోట సంఘములో సభ్యుడనైతిని. తోట సభ్యులందరి యిండ్లకు గార్డన్ సూపరిండెంటు వచ్చి తోటను యే విధముగ వేయవలసినది మార్గములన్నిటిని బోధించుచుండెను. ఆ విషయములన్నిటిని శ్రద్దగ నేర్చుకొని, తోటను వేయుటకు ప్రారంభించితిని.
ఇంటి ముఖద్వారము తూర్పుదిశను చూచుచుండును. చలిదేశమగు బెంగుళూరునందు ప్రాతఃకాలమున సూర్యభగవానుడు మా యింట ప్రవేశించి మమ్మానందింప చేయుచుండెను. ఇంటివాకిటి కెదురుగ విశాలమైన నలుచదరపు ఖాళీ స్థలముండెను. ఆ స్థలపు మూడుదిశల