16
బెంగుళూరు
బసవని గుడివీధిలో ఒక పెద్దతోటగల బంగళాను తీసి దానిని అనేకవిధములుగ పెంచితిని, ఆ తోటను క్రమముగ పుష్పవనముగ మార్చి ప్రతి సంవత్సరము ఆ యూరిలో సర్కారు తరఫున జరుగు తోటల పోటీ పరీక్షలలో పాల్గొనుచు, నా తోటకు మంచి బహుమానములను ప్రతియేటా పొందుచుంటిని. ఇక్కడ మందుల ఫ్యాక్టరీని పెట్టి మైసూరు రాజ్యమునకంత మందులు పంపుచుంటిని. యుద్ధ సమయములో బెంగుళూరు యింటికి మంచి ధర వచ్చినందున విక్రయించితిని. పిమ్మట బెంగుళూరుకు పోయినప్పుడెల్లను శాస్త్రిగారింట బస చేయుచున్నాను. శాస్త్రిగారు యిటీవల మంచి యిల్లును విశ్వేశ్వరపురమున కట్టించిరి. వీరు యిప్పుడు మంచి ధనికులయినను 'కేసరి కుటీరము'ను మరిచిపోకుండ ఏజంటుగానే యిప్పటికిని పనిచేయుచున్నారు. ఆంధ్రులు బెంగుళూరు పోయినప్పుడు శాస్త్రిగారి హోటలులోనే బసచేసెదరు. వీరు ఆంధ్రులు, ములికినాటివారు. తెలుగు వారికి కావలసిన పచ్చళ్లు ఆవకాయ మొదలగునవి వీరి హోటలులో వడ్డించెదరు.
పూదోట వినోదమునకేగాక ఆరోగ్యభాగ్యమునకును మానసిక వ్యాధులకును మంచి మందు. ప్రాతఃకాలమునలేచి సుగంధ పుష్పముల చెట్లనడుమను, లతాగృహములలోను సంచరించునప్పుడు వీచు ఆ మంద మారుతము వలన గలుగు ఆ బ్రహ్మానందమును వర్ణించుటకు యెవరి తరము? సుగంధ పుష్పరాజమును ఆఘ్రాణించుటవలన కలుగు 'మనోహర' మను మందు మనోవ్యాకులములను మాయము చేయును. పూదోటలో పూదేనియకు విచ్చలవిడిగ విహరించు భృంగముల మధుర