చిన్ననాటి ముచ్చట్లు137
ఆశ్రమము చుట్టు పంపా సరోవరము, ఋష్యమూకపర్వతము, నీలాద్రి, శ్రీ రామవనం మొదలగు పురాతన పవిత్ర క్షేత్రములు గలవు. ఈ స్థలములన్నియు ఈ పేర్లతోనే యిప్పటికిని యున్నవి. (ఇచటివారైతే ఆ యాత్ర ప్రదేశములతో రామాయణ గాథకు సంబంధము కల్పించుకొని యున్నారు. గోదావరిలో శబరియను ఉపనది కలియుచున్నది. కాని బళ్లారి ప్రాంతమున ఋష్యమూక పర్వతాలు కలవని చెప్పకొందురు.)
మారుతి పర్వతమునుండి వర్షాకాలమున ఓషధులసారము ఆల్వాయిలో పారు పెరియారు నదిద్వారా కొట్టుకొనివచ్చును. ఈ కారణమున ఆల్వాయి నదీ స్నానము అనారోగ్యులకు అనుకూలముగ నున్నది. వేసవికాలమున దూరదేశములనుండికూడ రోగవిముక్తులగుటకు ఇక్కడికి వచ్చి సుఖముగ వెళ్ళుదురు. ఈ రైలు స్టేషన్ తిరుచూరుకు యెర్నాకులమునకు మధ్యనున్నది.
కొచ్చి రాజ్యమునకంతయును గొప్ప శివాలయము వడకన్నాధ క్షేత్రము తిరుచూరునందున్నది. తిరుచూరుకు సమీపముననే గురువాయూరునందు శ్రీ మహావిష్ణువు వెలసియున్నాడు. త్రిప్రయారను క్షేత్రమున శ్రీరామచంద్రమూర్తి దేవాలయము గలదు. ఇంకయును ననేక పుణ్యక్షేత్రములు గలవు. తిరువనంతపురం రాజు పద్మనాభుని దాసుడు. కొచ్చిను మహారాజు వైదిక శిఖామణి. దేవాలయములలో జరుగు వుత్సవాదులకు వీరు హాజరగుచుందురు. నిరాడంబరముగ రాజ్యపాలన చేయు మహాపురుషులు వీరు.