పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136 చిన్ననాటి ముచ్చట్లు

రక్తచందనము, రక్తవర్ణ పుష్పములు, ఎర్రగా పండిన పండ్ల, కుంకుమ, కుంకుమ పూవు - మొదలైన పదార్ధముల నిచ్చి ఆరాధింతురు. అనగా వినియోగము కాని సృజనశక్తి (మాతృత్వము) అగు నంతశక్తి అంతర్భూతమైయున్న కన్యకా స్వరూపము నారాధించి శక్తి సంపన్నులు అగుచున్నారు.

కేరళమున గృహలక్ష్మిని కులదేవతగా పూజింతురు. కొమారుడు రాజు అయినను కన్నతల్లి యెదుట చేతులు కట్టుకొని నిలుచుండుటయే వారి భక్తి విశ్వాసము. కూతుండ్లు అన్నదమ్ములందరు ఆమె ఆజ్ఞను రాజాజ్ఞగ పాలించెదరు. కుమార్తెలు తల్లిని విడిచిపెట్టి అత్తవారింటికి పోవు ఆచారము అక్కడలేదు. భార్య కావలసి వచ్చినప్పుడు భర్త భార్యయింటికి వచ్చిపోవుటయే వారి కులాచారము. ఇందువలన అక్కడి ఆడవారికి అత్తపోరు లేదు. ఆడబిడ్డల రాపిడియును నుండదు. తల్లియే కుటుంబమునకు అధికారి. కుటుంబ ఆస్తియంతయు ముఖ్యముగ ఆడవారికే చెందును.

శ్రీ రామచంద్రమూర్తి పంచవటిని వదలి శబరి ఆశ్రమమునకు వచ్చెను. ఈ శబరి ఆశ్రమము తిరువనంతపురమునకు సుమారు 160 మైళ్ల దూరముననుండు మహారణ్యమున శబరి పర్వతము మీద నున్నది. ఈ శబరి పర్వతము మీద నుండు అయ్యప్పన్ అను దైవము హరిహరాదులకు పుత్రుడు. విష్ణుమూర్తి మోహినీరూపమును దాల్చి శివుని మోహింప చేసినప్పుడు వారిరువురకు పుట్టిన దేముడని స్థలపురాణము చెప్పుచున్నది. ఈ క్షేత్రమున ప్రతి సంవత్సరము కేరళదేశమునుండి వేలువేలుగా జనులు శబరికొండనెక్కి అయ్యప్పన్ ను పూజించివచ్చుచుందురు. శబరి ఆశ్రమమునకు పోవు భక్తులందరు నీలివస్త్రములను ధరించి విభూతి రేఖలను దట్టముగ దిద్దుకొని చేత త్రిశూలములను ధరించి శివగీతములను పాడుచు శబరికొండ నెక్కెదరు.