Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132చిన్ననాటి ముచ్చట్లు

పిదప జరుగు కర్మచౌళము - అనగా ప్రథమముగా కేశఖండనము. మనదేశమున బాలురకే ఈ మహోత్సవము జరుపబడును. ఆ దేశమున బాలికలకును జరుపుదురు. అది వారికి అశుభము కాదు. సామాన్యముగ నిది 3వ సం||ననో, 5వ సం||ననో జరుపబడును. ఒక్కొక్కప్పడు బాలురకైదవఏటును బాలికల కేడవఏటును జరుపబడుట కలదు. బాలురకు శిఖ విడిచి తలయంతయు గొరుగబడును. బాలికలకు ఒకటి రెండు వెండ్రుకలు మాత్రము లాంఛనముగ తీసివేయుదురు. ఈ కర్మ జరుగునపుడు అశ్వలాయన సూత్రానుసారము బిడ్డను అగ్నిహోత్రమునకు పడమరగా తల్లివడిలో కూర్చుండ బెట్టుకొనును. తండ్రి తల్లికి దక్షిణముగా కూర్చుండి 21 దర్ఛపోచలు చేతబట్టి బిడ్డతలపై మంత్రపూర్వకముగ జలమున చిలకరించును.

ఆ తరువాత కర్ణవేదము - అనగా చెవులు కుట్టుటకూడా - 3వ ఏటనో 5వ ఏటనో జరుగును. ఇదియును మంత్రపూర్వకమే. ఈ పని గావించుటకు ముందు బాలునికి చక్కగా భోజనము పెట్టుదురు.

అట్లే, మూడవ సం||న గాని, 5వ సం||న గాని అక్షరాభ్యాసమగును. ఇందుకు సామాన్యముగా విజయదశమినే శుభముహూర్తముగా నిర్ణయింతురు. గణపతి పూజాదికములైన పిదప బాలునికి తండ్రియో, పోషకుడో బంగారపుటుంగరముతో 'ఓం' కారమును నాలుకపైవ్రాసి చెవిలో నుచ్చరించును. పిల్లవాని వుంగరపు వ్రేలు పట్టి బియ్యములో 52 అక్షరములు చెప్పుచు వ్రాయించును. మున్ముందుగా మనము 'ఓం నమఃశివాయ సిద్దం నమః" అన్నట్లే - వారు 'ఓం హరిశ్రీగణపతయే నమః' యని చెప్పింతురు. బాలుడు బుద్దివిశారదుడగుటకై మంత్రపూర్వకముగ వెన్న తినిపింతురు.