చిన్ననాటి ముచ్చట్లు131
మొనర్చును. అప్పడే అతడు శిశువు దీర్ఘాయువునకై యోగక్షేమములకై దానధర్మము లొనర్చును. నేతిని, తేనెను కొద్దిగా కొద్దిగా తీసికొని కలిపి దానికి కొంచెము బంగారమును చేర్చి, అదృష్టచిహ్నముగా దానిని బంగారు కడ్డీతో కలియబెట్టి ఒక బంగారుపాత్రతో బిడ్డగొంతులో పోయును. ఆ కార్యమొనర్చుచు కొన్ని ఋగ్వేదమంత్రముల నతడు వల్లించును. ఆవిధముగా నాకాలపరిమితిలో నది జరుగనిచో పురుడు వెళ్లువరకు జరుగుటకు వీలులేదు. పురుడు మనదేశములోవలెనే 10 రోజులు పట్టుదురు. 11వ రోజున బాలింత శుద్ధి స్నానమొనర్చును.
పిదప కర్మ నామకరణము. మనవలె 11వ రోజునగాక 12వ రోజున జరుపబడును. తండ్రియే బిడ్డను వడిలో కూర్చుండబెట్టుకొని, మంత్రపూతముగా, విసర్గాంతమగు నామధేయమును సంస్కృతమున బిడ్డచెవిలో ఉచ్చరించును. తండ్రి పిదప తల్లియు అట్లే ఆ నామధేయమును శిశువు చెవిలో చెప్పును.
బిడ్డకు నాలుగవ మాసము వచ్చువరకు బాహ్యప్రదేశమునకు బిడ్డను తేరు. అప్పడు 'నిష్క్రమణము' అని యొక కర్మ జరుపబడుచున్నది. ఇందుకుగాను పనసచెట్టు నొకదాని నలంకరింతురు. బిడ్డ నప్పుడారు బయటికి తెచ్చి బిడ్డకాలితో ఆ పనసచెట్టు వేరు తొక్కింతురు. మామూలుగా బ్రాహ్మణులకు దానధర్మము లొనర్తురు.
శిశువు దినదినాభి వృద్దినందుచుండగా ఆరవనెలయందే అన్నప్రాశనము జరుగును. శుభముహూర్తమున అన్నమును, తేనె, నేయి, చక్కెరలతో చేర్చి శిశువుచే తినిపించుదురు. ఈ అన్నప్రాశన సమయమున అశ్వలాయన గృహ్యసూత్రానుసారముగ మంత్రములు చదువబడును.