Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124 చిన్ననాటి ముచ్చట్లు

దిగువ తిరుపతిలో గోవిందరాజస్వామి దేవాలయము చాలా పెద్దది. యాత్రికులందరు ముందు దానిని దర్శింతురు. ఆ పిదప దిగువ తిరుపతికి ఒక మైలు దూరమున నుండు కపిలతీర్థంలో మునిగి మరీ కొండ ఎక్కుతారు. అది యొక జలపాతం వల్ల ఏర్పడ్డ కొలను. ఆ జలపాతం ఒక హనుమంతుని విగ్రహముపై పడుచుండును. ఈతనేర్చిన వారు ఈది వెళ్లి హనుమంతుని తలపై కూర్చుండి జలపాత స్నానము నేరుగా చేసివస్తారట.

కొండను 5 మైళ్లదూరము నిలువున ఎక్కుదురు. మొత్తము 7 కొండలు ఎక్కవలెను. మధ్యమధ్య అడవులు, తిప్పలు, సమతలములు ఉండును. ముఖ్యముగా మోకాళ్ల పర్వతమెక్కుట కష్టతరము. పూర్వము అందరు కష్టపడి ఎక్కేవారు. ఓపికలేనివారు డోలీలలో మోయించుకొని వెళ్లేవారు. ఇప్పడు రోడ్డు వేయబడినది; బస్సులు నడచుచున్నవి.

మొదట ఈ పర్వతం మేరుపర్వతంలో భాగమని, వాయుదేవునికి, ఆదిశేషునికి వాగ్వాదమురాగా మేరుపర్వత భాగమును తన పడగపై నెత్తుకొని ఆదిశేషుడు తన మహిమ చూపగా, వాయువా పర్వతము నెగురగొట్టి తనశక్తి చూపెనట. ఆ ఎగిరి వచ్చిన పర్వతము - ఇట్లు ఈ ప్రదేశమున పడి తిరుపతియైనది. తొలినామధేయము శేషశైలము లేక శేషాచలము.

దేవాలయమునకు మూడుమైళ్ల దూరములో మరియొక కొలను 'పాపవినాశం" అని గలదు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి విగ్రహము చాల సుందరమును గంభీరమునై 7 అడుగుల ఎత్తున యుండును. ఈ విగ్రహము తొలుత శైవమనియు, శాక్తేయమనియు పండితులందురు. అందుకనుగుణ్యముగా జటాజూటము; ఫణిహారములు మున్నగు శైవచిన్నెలు విగ్రహమున