పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116 చిన్ననాటి ముచ్చట్లు

వృక్షము యిక్కడ కలదు. ఆ వృక్షమును యిప్పటికిని భక్తి శ్రద్దలతో పూజించుచున్నారు. మరణానంతరము స్వర్గమునకు పోదలుచుకొన్నవారు ఈ చెట్టుకొమ్మన ఉరిదీసుకొనుట ఇక్కడి స్థలపురాణము.

ఇక్కడనుండి జగన్నాథము చేరితిమి. జగన్నాథమున ఒక ఉరియా మంగలి తీర్థవాసునింట దిగితిమి. అక్కడ మనము వంటచేసుకొని భోజనము చేయగూడదట. దేవాలయములో వండిన పదార్ధమునే దేవతాప్రసాదముగ భుజించవలయును. గనుక అక్కడి మంగలి కుండలతో వండిన అన్నమును, పప్పును మట్టిపాత్రలతోనే తెచ్చి మాకు పెట్టెను. ఇక్కడ దేవాలయములో 7 కుండల దొంతిమీద అన్నమును వండెదరు. అనగా 7 కుండలలోను బియ్యము నీళ్లు కలిపి ఒక దానిమీద యొకటి నా పొయిమీద పెట్టెదరు. అవి అన్నియు ఒకే సమయమున పచనమగును. ఇట్లు వండిన అన్నమే స్వామి ప్రసాదము.

ఇచ్చట జగన్నాథుడు ముఖ్య దేవుడు. బలరామస్వామియు ఉపదేవత. ఇక నిచ్చట స్త్రీదేవత లక్ష్మీగాని, రుక్మిణిగాని గాక సుభద్ర - ఇది అపూర్వము. జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణభగవానుడు తన చెల్లెలి కట్టి వరమిచ్చెనని ఏదో పుక్కిటి పురాణమును చెప్పదురు.

కాశీయాత్ర అనంతరము కొన్నాళ్లకు కేరళదేశ యాత్రకు బయలుదేరితిని. దివాన్ బహదూర్ దొడ్ల రాఘవయ్యగారు ఆరోజులలో తిరువనంతపురంలో (తిరువాన్కూరు) దివానుగా నుండిరి. ఆ సమయముననే నేను మళయాళదేశ యాత్రకు బయలుదేరితిని. శ్రీ రాఘవయ్యగారు నాకు చిరపరిచితులు. అందుచే ముందుగా తిరువనంత పురమునకు వెళ్లితిని. వీరు నాకు పద్మవిలాసమను భవనమున బస కుదిర్చిరి.