పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114 చిన్ననాటి ముచ్చట్లు

జరుపవలయును. శ్రీమహావిష్ణుని పాదస్పర్శ సోకిన స్థలమిదియని స్థలపురాణమున గలదు.

మూడవసారి శ్రాద్దము చేయవలసిన స్థలము 'అక్షయవట'మను వటవృక్షము క్రింద. ఇక్కడనే కడపట శ్రాద్దమునుబెట్టి గయాక్షేత్ర యాత్ర ముగించుకొనవలయును.

విష్ణుగయ నుండి సుమారు 8 మైళ్ల దూరముననున్నది బుద్దగయ. హిందువులకు కాశీక్షేత్రము యెంత పావనమైన స్థలమో ఈ బుద్దగయ బౌద్దులకు అంత పావనమైనది. దీనిని బోధగయనికూడ పిలిచెదరు. బుద్ధభగవానుడు జ్ఞానసిద్ధిని పొందిన స్థలము. పూర్వమున ఈ మహాబోధియను ప్రసిద్ధి చెందిన వృక్షము క్రిందనే వీరు సిద్ధిని పొందిరి. ఆ మహాబోధివృక్షము ఇప్పటికిని ఇక్కడ నున్నది. అశోక చక్రవర్తి ఇక్కడికి వచ్చినట్లు శిలా శాసనములు యింకను యిక్కడనున్నవి. బౌద్ధమత ప్రచారకోత్తముడును అద్వితీయ గుణసంపన్నుడును అగు ఆ చక్రవర్తి శిలావిగ్రహమును ఇక్కడ ప్రతిష్టింపబడియున్నది.

ఈ క్షేత్రమును దర్శించుటకు ఇప్పటికిని నానాదేశములనుండి జనులు వచ్చుచున్నారు. ప్రతిదినము యిక్కడ చైనా, జపాన్, సిలోన్, బర్మా మొదలగు దేశముల నుండి వచ్చువారిని చూడవచ్చును. 'రాజగృహం' యను స్థానమునుండి బుద్ధుడు మతప్రచార ప్రారంభమును చేసినను ప్రపంచమంతయు సూక్ష్మదృష్టితో చూచుచు సిద్ధిపొందిన స్థలమిది.

ప్రయాగ (అలహాబాదు)

మేము కాంగ్రెసుకు హాజరగుటకు ప్రయాగ క్షేత్రమునకు పోతిమి. ప్రయాగ మహాక్షేత్రమున మహనీయులెందరో పూర్వము యజ్ఞయాగాది క్రతువుల జరిపినందున ఈ క్షేత్రమునకు ప్రయాగ యనుపేరు కలిగినదట.