పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112 చిన్ననాటి ముచ్చట్లు

పురాతనపు పుణ్యక్షేత్రములను దర్శించి రావలయుననే కోరిక నాకు చిరకాలముగ నుండెను.

ప్రాతఃకాలముననే గంగాస్నానమునకు బయలుదేరితిమి. విశాలాక్షి ఘట్టమునుండి మణికర్ణికా ఘట్టమునకు సుమారు ముక్కాలుమైలున్నది. అక్కడికి గంగవడ్డుననే నడిచిపోవలయును. మార్గమున యుండిన ఘట్టములలో అనేకులు స్నానమును చేయుచుండిరి. మేము నడుచుచుండు మార్గమున పోవువారు కొందరు 'రాం, రాం,' 'హరే, హరే'యని ధ్యానమును చేయుచు పోవుచుండిరి. మరికొందరు తమ సొత్తులను మూటకట్టుకొని తలమీద పెట్టుకొని 'శివ', 'శివ' యనుచు స్నాన ఘట్టమునకు నడుచుచుండిరి. కొందరు యువకులు, యువతులు చేతులు పట్టుకొని స్నానమునకు పోవుచుండిరి. బాల బాలికలును పరుగిడుతు గంగవైపునకు పోవుచుండిరి. తాతలు అవ్వలు కఱ్ఱల నాధారముచేసుకొని తిన్నగ నడుచుచుండిరి.

మేము మణికర్ణికా ఘట్టమునకు చేరుసరికి 10 గంటలయినది. మమ్ములను వెంబడించిన పురోహితుని ఆజ్ఞ ప్రకారము అక్కడ చేయవలసిన స్నానాది కర్మకాండనంతయు ముగించుకొంటిమి. అది డిశంబరు మాసమగుటచే విపరీతమైన చలిగ నుండెను. గంగాస్నానముచేసి గట్టునకు వచ్చులోపలనే కాయము కట్టెవలె మారినది. ఆ గంగ గట్టున కొందరు సన్యాసులు చలిమంటలను వేసుకొనుచుండిరి. స్నానము చేసిన వారు చలికి తాళలేక ఆ మంటలచుట్టు కూర్చుని చలికాచుకొనుట చూచి మేమును అక్కడ చేరితిమి. కొంతసేపు అక్కడ కూర్చుని సన్యాసులకు తల ఒక కాని యిచ్చి బయలుదేరి విశ్వేశ్వరుని దేవాలయము ప్రవేశించితిమి.

దోవలో ఇరుప్రక్కలను కూర్చుని యాచించు యాచకులకు కాసుల నిచ్చుచు లోపలకి సులభముగ పోతిమి. అక్కడక్కడ మరణించువారిని