Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4 చిన్ననాటి ముచ్చట్లు


తురుముకొని కోలాహలముగా వుయ్యాలలూగు చుండెడువారు. అట్టి వినోదములు ఈనాటి స్త్రీలకు పరిచయము లేవు. అవి జాతీయమగు క్రీడా వినోదములు; దేహమునకు చురుకు, పుష్టినిచ్చునవి కూడ, మాతల్లి రవికెలను కుట్టి సంపాదించిన డబ్బు మా భోజనమునకు కొంతవరకు సరిపోయేది.

ఆ కాలములో పండుగనాడు, తద్దినము నాడు మాత్రమె వరి అన్నమును తినేవారము. తక్కినదినములలో జొన్నలు, సజ్జలు, వరిగలు వాడుకొనువారము.

నెయ్యి, వరిబియ్యమును మాత్రము డబ్బిచ్చి కొనేవారము. వంటచెరకునకై మాతల్లి పొలముల చాయవెళ్లి కంది దుంపలను త్రవ్వి తెచ్చెడిది. కందిమొక్కలను కోయునపుడు జానెడు లోపున భూమిపై విడిచి కోయువారు. ఆ విడువబడిన దానిని సమూలము త్రవ్వి తీయుచో చక్కని వంట చెరకుగా ఉపయోగపడేది. తిరగాపైరు వేయుటకు అడ్డములేకుండా ఈ దుంపలు తీసివేయవలయును. పైగా రైతు లటు నిటు పొలములలో తిరుగునప్పుడీ దుంపలు పొరబాటున కాలులో గుచ్చుకొన్నచో గాయమై ఒక రాగాన మానదు. అయితే తామే త్రవ్విస్తే కూలి ఇవ్వవలెను. అందుచేత సామాన్య రైతుల ఇంటి ఆడువాండ్లు వచ్చి వారి ఇంటికి వంటచెరకున కవసరమైనన్ని త్రవ్వి తీసుకొని పోవుదురు. రైతులున్నూ, పేదవారిని ఉచితముగానే త్రవ్వి తీసుకొని పోనిత్తురు. ఈ ప్రకారం మాతల్లి సం॥నకు చాలినన్ని దుంపలను త్రవ్వి జాగ్రత్త వెట్టేది.

మా ఊళ్ళో మా బంధువులు ములుకుట్ల కృష్ణయ్య అనేవారు భిక్షాటనమున, పౌరోహిత్యమున తన జీవితమును గడుపుకొనేవారు. వారు అప్పుడప్పుడు మా ఊరికి సమీపములో ఉండే బసవన్న పాలెమనే చిన్న