పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు103

రాజ్యమున గురువాయూరు విష్ణుమూర్తికి అంత ప్రఖ్యాతి. ఈ దేశమున ఈ దేవుని 'గురువాయూరు అప్పన్' అనెదరు. ప్రతిదినము ఈ దేవుని పూజించుటకు వేలకొలది భక్తులు వచ్చి పూజించి పోవుచుందురు. ఈ నారాయణ క్షేత్రమున నంబూదిరీ బ్రాహ్మణ పండితోత్తములు కొందరు చేరి నారాయణ జపము, భజన, ఉపన్యాసములను ఇచ్చు పండిత బృందమొకటి గలదు. ఆ భక్తబృందమునకు చేరిన దివాకరనంబూదిరి బ్రాహ్మణుడు గలడు. ఈయన వేదాంతాది శాస్త్రవేత్త. భక్తుడు, భాగ్యవంతుడు. వీరి కుమారుడగు చిరంజీవి బాలకృష్ణునకు నా కుమార్తె చి| సౌ| శారదనిచ్చి వివాహమును చేసితిని. ఈ నంబూదిరి బ్రాహ్మణుని భార్య సుప్రసిద్ద నడుంగాడి కుటుంబమునకు చేరిన కేరళస్త్రీ. నా అల్లుడు M.B.B.S. డాక్టరు పరీక్ష నిచ్చి మద్రాసు జనరల్ హాస్పటల్లో యుండి పిమ్మట ఇటీవల ముగిసిన రణరంగమునకు వెళ్లి తిరిగి వచ్చి మద్రాసులో జనరల్ హాస్పిటల్లో నున్నాడు. (Capt. T.M.B.Nedungadi, I.M.S.). వీరికి ఇప్పుడు నలుగురు బిడ్డలు గలరు. పెద్దకుమారుని పేరు రాధాకృష్ణుడు, రెండవ కుమారుని పేరు బాలకేసరి. మూడవ కుమార్తె పేరు మధుమాధవి. చిన్న కుమారుని పేరు జయచంద్రుడు. మా అల్లుని యిద్దరి చెల్లెండ్రను కొచ్చి రాజు కుమారులగు రాజాకేరళవర్మ, రాజారామవర్మ రాజులకిచ్చి వివాహమును చేసిరి. ఈ యిరువురు రాజబంధువులేగాక మూడవవారగు రాజారవివర్మగారుకూడ దగ్గిర బంధువు. వీరు రాజ్యమును చేయుటకు సమీపమున నుండినవారు. కనుక నా రెండవ కల్యాణమువలన రాజబంధువులుకూడ నాకు గలరు. ఈ రాజకుమారులు సదాచార సంపన్నులు. దేవ బ్రాహ్మణ భక్తి గలవారు. మద్రాసులో కొచ్చిరాజులకు కొచ్చి భవనము Cochin House ఉన్నను, వీరు మద్రాసుకు వచ్చినప్పుడెల్లను నాయింటనే బస చేయుచుందురు. మేము మైసూరులో కాపురమున్నప్పడు చాముండేశ్వరి మాకు రెండవ కుమార్తెను ప్రసాదించినది. ఈమెపేరు వసంతకుమారి, నా మరదలు కాత్యాయనియను