పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 3

పోయేవాడను. పిమ్మట చద్దిఅన్నమును తిని, ఎవరి పొలముల వద్దకైనా పోయి వంకాయలను, గోంగూర, పచ్చిమిరపకాయలను, దోసకాయలు మొదలైన వానిని అడిగి కోసుకొనివచ్చి తల్లికి ఇచ్చేవాడిని. మరి జొన్నకంకులు, సొజ్జకంకులను కూడా తెచ్చుకొనేవాడిని.

మా యింటి సమీపముననే ఉప్పలవారి మర్రిచెట్టు అని, యొక పెద్దచెట్టు ఉండెను. అది యిప్పటికిని యున్నది. దాని ఆకులు చాలా పెద్దవి. విస్తరాకులు కావలసి నేను ఒకనాడు ఆ మర్రియాకులను కోయుటకై చెట్టెక్కితిని. కొంతదూరమెక్కగానే కండ్లు తిరిగినవి. పైకెక్కలేను; క్రిందికి దిగలేను. అట్లనే చెట్టు కావలించుకొని యుంటిని. పట్టు తప్పెనా నీపట్టున వ్రాయవలసిన అగత్యముండేది కాదు. దైవవశమున ఇంతలో మరియొకడు ఆకులను కోసుకొనుటకు వచ్చి నా అవస్థ చూచి నన్ను వాడు మోకుతో క్రిందికి దించెను. అప్పటినుండి నేను చెట్టు ఎక్కడము మాని, దోటి కట్టుకొనిపోయి దానితో ఆకులను కోసి తెచ్చేవాడను. ఆ ఆకులతో విస్తళ్లను కుట్టేవాడను. జొన్నదంటు ఈనెలను సన్నగా చీల్చి, విస్తళ్లను సన్నగా కుట్టు నేర్పరితనము నాకు ఉండేది. నేను కుట్టిన విస్తళ్లను చూచిన మిషను కుట్టువలె ఉండేది.

నాతల్లి రవికెలు కుట్టడంలో చాలా నేర్పరి. ఊరివారంతా మా అమ్మవద్దకు వచ్చి రవికెలు కుట్టించుకొనేవారు. సాదా రవికెలు కుట్టిన ముక్కాలణా; పూలువేసి కుట్టిన ఒక్కణా; తేళ్లు, మండ్రగబ్బలు, పక్షులు - వీని బొమ్మలువేసి కుట్టిన రెండు అణాలు; యిచ్చేవారు. ఆ కాలమునాటి నాజూకు వస్తాలంకారములు పాలచాయ కోకలు, నల్లచాయ రవికెలు, గువ్వకన్ను, నెమలికన్ను అద్దకము రవికెలు. అట్లతద్దె పండుగ వచ్చినప్పడు ఆనాటి స్త్రీలు, ఈ విధమగు చీర రవికెల ధరించి, కొప్పలనిండ బంతిపూలు