100 చిన్ననాటి ముచ్చట్లు
నెల్లూరిలో నాకు ముఖ్యస్నేహితులు మైదవోలు చంగయ్య పంతులుగారును, (Public Prosecutor), A. సంతానరామయ్య గారును (V.R.H. School, Headmaster) చుండూరి వెంకట క్రిష్ణయ్య గారును (Vakil), విస్సా రాజగోపాలరావుగారును (Vakil) యుండిరి. మొదటి ముగ్గురును గతించిరి. వీర్ల స్నేహమువల్ల నేను పలుమారు నెల్లూరికి పోవుచుంటిని. తిక్కన జయంతి ఉత్సవాదులలో పాల్గొనుచుంటిని. దసరా ఉత్సవముల లోను పాల్గొనుచుంటిని. గృహలక్ష్మీ స్వర్ణకంకణ బహుమానములను శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారికిని, శ్రీమతి చిలకపాటి శీతాంబగారికిని, శ్రీమతి కవితిలక కాంచనపల్లి కనకమ్మ గారికిని, శ్రీమతి కమలాదేవిగారికిని నెల్లూరి పురమందిరముననే ప్రోగ్రసీవు యూనియన్ తరఫున యిచ్చితిని. మొల్లజయంతులను జరిపించి స్త్రీ రచయితలకు బహుమానముల నచ్చటనే యిచ్చితిని.
మద్రాసులో నెల్లూరి విద్యార్థుల సంఘము వుండేది. ఈ సంఘమునకు చేరిన విద్యార్థులును, నెల్లూరునుండి మద్రాసుకు వచ్చి ఉద్యోగములలో యున్న వారును కలసి ప్రతి సంవత్సరము వనభోజనమునకు సమీపమునయుండు తిరువత్తూరు, విల్లివాకము, అమింజికరె, అడయారు మొదలగు స్థలములకు పోయి అక్కడ ఒక దినమంతయు గడిపి మరునాడు యిండ్లకు వచ్చుచుందుము. ఈ విద్యార్థులందరు గలసి సుమారు 150 మంది యందురు. ఈ వనభోజనమునకు విద్యార్థులందరు చందాలు వేసుకొని కూడిన డబ్బును నావద్ద తెచ్చియిచ్చేవారు. మిగత కావలసిన డబ్బును నేను వేసి ఆ ఖర్చులన్నియు చేయుచుంటిని. పోయిన స్థలములో పిల్లకాయలు భలిగుడు యాటలు, చీట్లాటలు ఆడి భోజనానంతరము సమీపమున నుండు కొన్ని చూడదగిన స్థలములకు పోయి వచ్చుచుండిరి. చెయి తిరిగిన ఆంధ్రులను వంటకు తీసుకొనిపోయి మంచి తెలుగు వంటలను చేయించి పిల్లకాయలకు తృప్తిగ పెట్టుచుంటిని.