చిన్ననాటి ముచ్చట్లు 99
నేను ముగ్గురు పిల్లకాయలను దగ్గరదీసి పెంచి పెద్దచేసితిని. వారిలో మొదటివాడు శిష్ట్లా శేషగిరి. వీడు నాకు దగ్గిర బంధువు. వీడిని యింటర్ ప్యాసు చేయించితిని. పిదప గవర్నమెంటు ఇండియన్ మెడికలు స్కూలులో చేరి LL.M. డిప్లొమాను పొందెను. నా యనుభవమును వానికి బోధించితిని. క్రమముగ అన్ని కార్యములలో సమర్థత కల్గిన పిమ్మట కేసరి కుటీరమునకు వైద్యుడుగను, ఆఫీసునకు మేనేజరుగను నియమించితిని. ఒంగోలు కాపురస్తుడగు శ్రీ చివుకుల శ్రీరామశర్మగారి పుత్రికనిచ్చి వివాహమును చేయించితిని. వీరిని నావద్దనే యుంచుకొంటిని. వీనియందు నాకు కలిగిన నమ్మకము, అనురాగమువలన కేసరి కుటీరమును లిమిటెడ్ కంపెనీగా మార్చునపుడు, వీడికి కొన్ని పేర్లనిచ్చి కంపెనీకి డైరక్టరుగ నియమించితిని. వీనికి బిడ్డలు కలిగి సంసారము పెద్దది కాగానే ఎగ్మూరులో నాకు వున్న యిండ్లలో ఒక యింటిని వీడిపేరట చేసి, వీడి కుటుంబమును నా యింట నుండి అక్కడికి మార్చితిని.
ములుకుట్ల మహాదేవయ్య. వీడు నా బావమరిది కుమారుడేగాక నా మేనమామ మనుమడు, ఆపేరటివాడు. వీనినికూడ చిన్ననాటినుండి చదువు చెప్పించి పెంచి పెద్ద చేసితిని. వీనికి రావు బహుదూరు కవికొండల బ్రహ్మయ్య పంతులుగారి కుమార్తె నిప్పించి పెండ్లి చేసితిని. భార్యాభర్తలకు కేసరి కుటీరమున నౌకరినిచ్చి నాయింటనే కాపురముంచితిని.
చివుకుల చెంచుపున్నయ్య. వీడు నా మరదలికొడుకు. వీడిని కూడ చిన్నప్పటినుంచి నావద్దనే పెంచితిని, వీడు ప్రస్తుతము 'గృహలక్ష్మి' పత్రికకు సంయుక్త సంపాదకుడుగాను, వీని భార్య సహాయకారిగను పనిచేయుచున్నారు.