98 చిన్ననాటి ముచ్చట్లు
జబ్బుగ యుండిన నా భార్య ఫిరంగి శబ్దములకు అదురుకొనగా స్మృతితప్పి క్రమముగ తెలివివచ్చెను. అప్పుడది జరిగెను. రెండవ ప్రపంచ యుద్దములో 1941 డిశంబరు జనవరి నెలలో జపాను ఓడలు మద్రాసుకు వచ్చుచున్నవని పుకారు కలిగినప్పుడు మద్రాసు జనమంతయు నలుదిక్కులకు పారిపోయినప్పుడు నా భార్యయు ఒంగోలుకు పోయి మా బంధువు చివుకుల శ్రీరామశర్మగారి యింట మరణించెను.
ఆమె క్రతువులు గడిచిన పిదప కొన్నాళ్లు నేను మద్రాసులో ఉంటూ ఉండగా బర్మాలో జపానువారు విజృంభించుకొలది సింగపూరు పడిపోయిన పిదప జపాను సేనలు ఏనాడో మద్రాసులో దిగునన్న భీతాహము ప్రజలలో హెచ్చసాగెను. రోజు రోజును వందలు వేలు జనము మద్రాసు విడిచి ఇతర ప్రదేశములకు వెళ్లిపోజొచ్చిరి. ఏప్రిల్ 1, 2 తేదులనుండి కలకత్తాలో బాంబులు పడినవని పట్నములో పుకార్లు రేగినవి. 3వ తేది మాయింట మహాదేవయ్య పెండ్లి, 4, 5-పై వార్తలింకను ప్రబలమైనవి. 6వ తేది మధ్యాహ్నమున మద్రాసులో తీరమునకు సమీపముగా శత్రునౌకలు తిరుగుచున్నవనియు, ఎప్పడైన దాడి జరగవచ్చుననియు, ఈ సారి ఊదబోవు హెచ్చరిక బాకా అభ్యాసమునకు గాక, వాస్తవమే అని తలచుడనియు - ప్రభుత్వమువారు శబ్దవిస్తరణ యంత్రసాయము నగరమంతయు చాటిరి. 22-9-1914 నాటి అనుభవము తిరిగి స్మృతికి వచ్చెను. నేనును, బంధువులను స్తలాంతరమునకు పంపుటకై రైలుకు వెళ్లియుండి, మిత్రుల బంధువుల బలవంతమున పట్నము వదలి వెళ్లితిని. ఉన్నవారు చిల్లర దొరకక, తినుటకు వస్తువులు దొరకక, హోటళ్లలో కాఫీయు దొరకక చాల బాధపడిరట. 14, 15, 16 తేదులలో పట్నం ముప్పాతికకుపైన ఖాళీ అయినదట. పిదప క్రమముగా తిరిగి పూటుకొన్నది. అప్పుడారునెలల పర్యంతము 'కేసరీ కుటీరం' ఆఫీసును తిరుచూరుకు మార్చితిమి.