12
అవాంతర దశ
మేము బందరువీధిలో నుండగా 22-9-1914 తేదిన మొదటి ప్రపంచ యుద్దములో జర్మన్ క్రూయిజర్ 'యమ్డన్' మద్రాసుపై ఫిరంగిగుండ్లు వదలినది. రాత్రి 9 గం||లకు భోజనానంతరము యింటి వరాండాలో యుంటిని. అకస్మాత్తుగ సముద్రములోనుండి గొప్ప వెలుతురును శబ్దమును చూచితిని. ఈ శబ్దము ఏమైనది ఎవరికి తెలియక గుంపులు గుంపులుగా సముద్రతీరము వద్దకు పరువెత్తిరి. నేనును కొంతదూరము వరకు పోయి బర్మాషెల్ ట్యాంకులు భయంకరముగ తగలబడుట చూచి వెనుకకు తిరిగితిని, 'యమ్డన్' మద్రాసుపై అకస్మాత్తుగ ఫిరంగుల గాల్చి పరుగెత్తి పోయెను. 'యమ్డన్' పోయిన పిమ్మట మనవారు కోటలోనుండి సముద్రముమీద ఫిరింగీలను పేల్చిరి. ఆనాడు రాత్రి మద్రాసునుండి జనము దిక్కు తెలియక నలుదిక్కులకు పరుగెత్తిరి. ఇల్లు విడచి పోలేనివారు అక్కడనే వుండిపోయిరి. తెల్లవారగనే పురజనులు సముద్రము వద్దకు వెళ్లి ప్రేలిన ఫిరంగీగుండ్ల వుక్కుముక్కలను యేరుకొనిపోయి 'యమ్డన్' జ్ఞాపకార్ధము యింటిలో భద్రపరచుకొనిరి. నేనును ఒక ముక్కను తెచ్చితిని.
ఆనాటి ఫిరంగీగుండు ఒకటి హైకోర్టు ప్రహరీగోడకు - తూర్పుదిశనున్న దానికి తగిలినది. దానివల్ల ఆ గోడ కొంత బొక్క పడినది. ఆ విశేషమును తెలుపుచు నా గోడను రిపేరు చేసినప్పుడా చోటు నీ క్రింది విధముగా నొకరాతిపై చెక్కించి గోడలో నమర్చియున్నారు. '1914 నెప్టెంబరు 22వ తేది రాత్రి జర్మన్ క్రూయిజర్ 'యమ్డన్' మద్రాసును ముట్టడించినప్పుడు ఒక గుండు ఈ ప్రహరీగోడకు తగులగా ఈ భాగమున కొంత గోడ ఎగిరిపోయినది'.