Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96 చిన్ననాటి ముచ్చట్లు

నిద్రను పొయ్యేవారు. ఆ కాలపు కరణాలు మంచి తిండిపుష్టిని, కండపుష్టిని కలిగిన భారీవారగుటవలన, శెట్టిగారు పంపిన తవ్వెడు చేరుడు బియ్యపు అన్నము వీరికి చాలిచాలక యుండెడిది. వీరందరు అద్దంకి అయ్యవార్లంగారి ముద్దరను వేసుకొనిన శిష్య వర్గమునకు చేరినవారగుటవలన వైష్ణవ సాంప్రదాయముల ననుసరించి దినచర్యను జరుపుచుండిరి. దట్టమైన తిరుమణి శ్రీ చూర్ణములను ధరించుచుండిరి. తులసి పూసల దండలను తామరపూసల దండలను త్రిప్పుచుండిరి. చుట్టలను కాల్చుచుండిరి. నస్యములను పీల్చుచుండిరి. పలుమారు కోర్టుల కెక్కుచు, రైతులను ఆశ్రయించి వ్యవహారములను పెంచి, పేచీలనుపెట్టి నేర్పుగ ప్రయివేటును చేయుచు పొట్ట పోసుకొనుచుండిరి.

పొరుగూర్లనుండి వచ్చిన ఈ కరణాలందరు జమాబందిని ముగించుకొని వూర్లకు పోవునపుడు - 'అబ్బాయి నీవు శెనగపప్పును కొనుక్కోమని తలా ఒక కాణీడబ్బును నా చేతిలోపెట్టి పోవుచుండిరి. అప్పటినుండి మరల వీరు మామయ్య ఇంటికి యెప్పడు వచ్చెదరా అని నేను వీరి రాకకు యెదురుచూచుచుండెడివాడను.

నా కాపురము, కమామీసు బందరు వీధిలో యున్నప్పుడే ఎగ్మూరులో యొక స్వంత భవనమునుకొని దానిని పెద్దదిగా కట్టించి, బందరు వీధినుండి ఎగ్మూరుకు మారితిని. ఎగ్మూరు యింటికి పోయిన పిమ్మట మందుల వ్యాపారము యింకను వృద్ధి అయినది. ఇంటికి సమీపముననుండు పూనమల్లి హైరోడ్డులో నొక పెద్దభవనమును అద్దెకు తీసుకొని అక్కడ ఆఫీసును మందులుచేయు ఫాక్టరీని యుంచితిని. అక్కడనే లోధ్ర ముద్రాలయమునుకూడ స్థాపించితిని. అక్కడనుండియే 'గృహలక్ష్మి' పత్రిక వెలువడినది.