Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 చిన్ననాటి ముచ్చట్లు

మామూలైనను అందరు ఇచ్చుకొన గలిగేవారుకారు. అయినను పిల్లకాయలవల్లనే పంతులుకు సంసారము తేలికగా జరిగిపొయ్యేది. పంతులు ఇంటిముందు వేయబడిన పూరికొట్టములో మాబడి ఉండేది.

ఆ కాలమున గుంట ఓనమాలు నేర్చుకొని ఆ పిమ్మట కొయ్య పలకమీద వ్రాయడమారంభించేవారము. కొయ్యపలకమీద వ్రాయుటకు ముందు నీలిమందు, దోసాకు పసరులు పట్టించి, బాగుగా మెరుగుపెట్టి, ఎండలో పెట్టేవారము. ఆరిన పిదప దానిపై బలపముతో వ్రాయవలసి యుండేది. ఆ కాలమున బలపపు కోపులనే మెత్తటి తెల్లరాళ్లుండేవి. వాటిని తెచ్చి రంపముతో సన్నసన్న కోపులుగా కోసి వానితో ఆ కొయ్య పలకపై వ్రాసుకొనేవారము.

నాలుగైదు సంవత్సరములు ఆ బడిలో చదివిన మీదట పెద్ద పుస్తకమును (సామాన్యముగా రామాయణము, లేనిచో భారతమో భాగవతమో) పట్టించుట జరిగేది. సరస్వతి పూజ జరిపి పిల్లవానిచేత రామాయణమును పంతులు చదివించేవారు. ఆ దినమున పిల్లకాయలకు పప్పుబెల్లాలు పంచి బడికి ఆటవిడుపు (శెలవు)ను ఇచ్చేవారు. ఈపెద్ద పుస్తకముతో ఆ బడిలోని చదువు సమాప్తము. ఆ కాలమున పెద్దపుస్తకము పట్టుట పూర్తి అయినచో, ఈ కాలమున బి.ఏ. పట్టా పొందుట వంటిది.

నేను పేదవాడిని గనుక పంతులుకు ఏమియు సమర్పించుకోలేని కారణమున నాకు దెబ్బలు తప్ప చదువు అంతగా అంటలేదు. నేను బడికికూడా క్రమముగా పోలేకపోతిని. ఏలననగా మాతల్లికి నేను కొంత సహాయం చేయవలసి ఉండేది. మాఊరిలో గుండ్లకమ్మ అనే నది కలదు. నేను తెల్లవారగనే ఏటికిపోయి, కాలకృత్యములు తీర్చుకొని, చిన్నకావడిలో రెండు చిన్నతప్పేలాలు పెట్టుకొని, ఏటిలో నీటిని ఇంటికి తీసికొని