పుట:Cheppulu Kudutu Kudutu....pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముందుమాట

నేను మాదిగలతో చాలా కాలం గడిపాను. వారి గాథలను విన్నాను. సంప్రదాయాలను తెలుసుకున్నాను. భారతీయ గ్రామీణ సమాజపు జీవితాన్ని రవ్వంత తీసుకున్నాను. భారతదేశపు సామాన్య ప్రజల ధార్మిక జీవితపు గుండెచప్పుడు విన్నాను.

దక్షిణ భారత ప్రాంతంలో నిరాడంబరులూ, బాగా నిర్లక్ష్యం చేయబడినవారూ మాదిగలు. తెలుగు నాట తోలుపని చేసేవారు. శతాబ్దాలుగా వారు చర్మాలను పదును చేశారు. చెప్పులు కుట్టారు. శూద్రుల నూతుల కోసం తోలు బాల్చీలను తయారు చేశారు. వారి ఎద్దులకు పట్టీలు తయారుచేశారు. చేతులతో చెప్పులు కుడుతూనే వారి సత్యాన్వేషణ జరిగింది. వారు చెప్పినదానినే నేను వివరిస్తున్నాను. ఇది నాకు ఒక విధముగా అపరిచిత విషయము. మాతంగి సంప్రదాయం గురించి, చర్మ నిష్టలుశాఖ గురించి, పేరంటాలు అనే సంప్రదాయం గురించి నా దృష్టికి వచ్చిన అనేక సంస్కరణ మత శాఖల గురించి, అంతా ప్రజలనించి నేను తెలుసుకున్నదే. నేను ప్రజలనుంచి తెలుసుకున్నదానికి తిరుగులేని సాక్ష్యంగా ఇతరుల పరిశోధనలను నేను ఉటికించలేను.

క్రిస్టియానిటీ ప్రస్థానపు కథలో-

నా మాదిగ స్నేహితుల నుండి ఇదంతా విన్నప్పుడు నేను పొందిన అద్భుతానుభవాన్నీ విశిష్ట మౌలికతనూ ఇంగ్లీషులో చెప్పేటప్పుడు కొంతయినా మిగల్చగలిగానని నమ్ముతున్నాను. పదిహేడేళ్ళుగా వారిలో చాలామందిని నేను ఎరుగుదును. వాస్తవికంగా అచ్చంగా వారి జ్ఞాపకాలను చిత్రించటానికి నాకు తగినంత లోతైన గుర్తులు ఉన్నాయి.

ఒంగోలులో ఆయన తొలిదినాలను నా భర్త రెవరండ్ జె.ఇ.క్లె. డి.డి. చెపుతూండగా విన్న సమాచారం మీదనే ఆధారపడటం నా ఉద్దేశం కాదు. మాదిగల స్థానంలో నిలబడి వారి నేత్రాలతో పరిస్థితిని చూడాలన్నది నా కోరిక. కనుక నా భర్త చెప్పవలసిన కథ వేరే ఉండవచ్చు.

మాదిగలను కలుసుకుని దగ్గరగా చూసి, వారి జ్ఞాపకాలలో భద్రం చేయబడిన గాథలను తెలుసుకునే అవకాశం యిచ్చిన నా భర్తకూ, భారతదేశంలోని అనేకమంది మిత్రులకు నేను కృతజ్ఞరాలిని. ఒంగోలులోని ఒక యూరోపియన్ పెద్ద మనిషి ప్రజల నుంచి నేరుగా ఈ గాథలను సేకరించటానికి సహాయం చేశాడు. లండన్లోనూ, ఇండియాలోనూ గ్రంథాలయాలలో అన్వేషణకు ఎందరో ఉదారంగా సహాయపడ్డారు. రాయల్ ఏసియాటిక్ సొసైటీ సభ్యులనేకమంది నుంచి నాకు విలువైన సలహాలు అందాయి. వారందరికీ నా కృతజ్ఞతలు.

లండన్, 1899

ఇ.ఆర్.సి


చెప్పులు కుడుతూ..కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు