పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

13

 చెప్పిన తరువాతేనా వెనక తగ్గవలసింది. కాని ఆయన వేషం, వకగంటా శంఖమూ యింతే తరవాయిగాని పూర్తిగా జంగందేవరలా కనపడింది. పయిగా వెలమవారేమిటి? విభూతిరుద్రాక్షలు వేసుకోవడం ఏమిటి? అని వకశంక. అందుచేత ఆయన మాటను నేను బొత్తిగా నమ్మలేకపోయాను. తుదకు విధిలేక నమ్మి, “మావైపున వెలంవారు యెవ్వరూ విభూతివగయిరా ధరింపరు.” అంటూ యేవో రెండు యథార్థమైనమాటలే చెప్పి ఆయనవల్ల కాళహస్తి ప్రాంతంలో శివభక్తులైన వెలంవారు వున్నట్టు తెలిసికొన్నాను. యిటీవల చాలారోజులకు గుంటూరుసీమవివాదాలనాడు చేబోలు కమ్మవారిని చూచి కమ్మవారిలో శైవులుండడం తెలుసుకున్నాను. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో కంసాలులలో తిరుమణి ధారులున్నట్లు తెలుసుకున్నాను. అందుకే కూప కూర్మంగా వుండడం యెవరికీ కూడదు. కవికి బొత్తిగా కూడదని అనుభవజ్ఞులు చెపుతారు. “అప్రవాసినంచ బ్రాహ్మణందృష్ట్వా సచేలస్నాన మాచరేత్" అనేవారట మా గురువుగారి గురుపరంపరలో వకరైన శ్రీ యింద్రగంటి గోపాలశాస్తుర్లుగారు. అది అట్లా వుండనిచ్చి ప్రకృతం మాట్లాడుకుందాం.

వర్ణాశ్రమాచారాల పట్టుదల

శ్రీ గంగాధరరామారావుగారు వైష్ణవ మతస్థులవడంచేత వారు పిలిపిస్తే వానమామల జియ్యంగారు శ్రీ రాజావారి ప్రధానగ్రామాల్లో ఒకటైన మాకడియం గ్రామం దయచేశారు. వారు దయచేసేటప్పటికి శ్రీ బులుసు పాపయ్యశాస్రులవారుకూడా శ్రీరాజావారి సమక్షమందే దయచేసియున్నారు. శ్రీ రాజావారికి గురుదర్శనానికి వెళ్లేటప్పుడు పాపయ్యశాస్రులవారి సహితంగా వెళ్లాలని కుతూహలం వుంది. కాని రాజావారికి వారు గురువులు గాని పాపయ్య శాస్రులవారికి వారు మతరీత్యా గురువులు గారుగదా? విద్యలోనో, యెవరూకారు. అట్టిస్థితిలో వారి సందర్శనానికి వీరేలావస్తారు? స్వబుద్ధిచేత రారు. శ్రీ రాజావారు మాత్రం రావలసిందని యేలా కోరుతారు? అప్పటి రాజులంటే వర్ణాశ్రమాచారాలను పరిపాలించడానికి బద్ధకంకణులుకదా? ఆరాజావారిరోజులలో మనగవర్నమెంటు యింత కట్టుదిట్టంలో లేకపోయినా కొంతేనా వ్యాపకంలో లేకపోలేదు. గవర్నమెంటు అధికారాలలో యేకొంచెమోతప్ప “నాన్‌బ్రామిన్సు" వున్నట్టులేదు. గొప్పగొప్పపదవులలో యేచిన్నపరీక్షలో ప్యాసయిన బ్రాహ్మణులే వుండేవారు. అప్పటికి ప్లీడర్ల ఆర్గుమెంటునుగూర్చి యిప్పటికిన్నీ కొందఱు వేళాకోళంగా చెప్పకుంటూవుంటారు. కోర్టుమునసబుగారు మీ ఆర్గుమెంటు చెప్పండనేసరికి, యెవరో వక్కలంకాయనఁట, పేరు జ్ఞాపకంలేదు. “నేను చాలా పెద్దకుటుంబీకుడను, వేఱే మనవిచేసేదేమిటి? యీ కేసు కోర్డు వారు నాకు వ్యతిరేకంగా చేస్తే నా దగ్గఱికి మఱోకేసు రాదు, కాఁబట్టి అనుగ్రహించ వలసిందని మీ ఘనతనుగూర్చి ^