పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/839

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గురువుగారు వట్టి అమాయికులు

943


వగయిరా వాక్యాలతో నన్ను శపిస్తూవున్నారు. నేను వ్రాసిన మాటలు జాగ్రత్తగా చూడక తమకు బొత్తిగా సంబంధమేలేని వాక్యాన్ని తమమీఁదకు తెచ్చుకొని నన్ను శపించే గురువుగారి అమాయికత్వాన్ని నేను వర్ణింపలేను. గోలకొండ పత్రికలో “ఊరిపిడుగు" వ్యాసంలో "గంధర్వలోకం" అనే తుంటరివ్రాఁతను గురించి తమకు సంబంధమున్నట్టు నేను వ్రాసినట్లు వృథాగా అపోహపడ్డారు గరువులు. అందులో వో. వెం. సుబ్బారాయశాస్త్రిగారి వాక్యంలో వున్న “శ్రీవారు” అనే పదం నన్ను బోధించేది కాని తమకు లేశమున్నూ చెందదు. దాన్ని సవిమర్శంగా చూస్తే అందు గురువుగారుపడ్డ ప్రమాదం వారి ఆత్మకే గోచరిస్తుంది. గోచరించాక అయ్యో అని వారే పశ్చాత్తాప పడతారు. కనక విస్తరించేది లేదు.

ఆ "గంధర్వలోక లేఖతో గురువుగారికిగాని, మఱివక మా పూర్వ శిష్యుడికిగాని సంబంధంలేదు. అది వ్రాసిన "గంధర్వు" డెవరో నేను బాగా యెఱుఁగుదును. అతఁడు కులాని కంతకున్నూ కళంకు తెచ్చుకొనే నిమిత్తం అట్టిపని చేసివుంటాడని ప్రతి ప్రాజ్ఞుఁడున్నూ గుఱితిస్తాఁడు. దివాంధంతో మాత్రం గురువులకు సంబంధం లేదనడానికి నా ఆత్మ విశ్వసించదు. "గంధర్వలోకము" తో సంబంధం వుందనడానికిన్నీ విశ్వసించదు. కాఁబట్టి వ్యక్తపరుస్తూ వున్నాను.

గురువుగారివలె నేను పరుషవాక్యాలు వాడడం లేదని గట్టిగా నేనున్నూ చెప్పగలను. నా వ్యాసాలుచూచిన వారున్నూ చెప్పగలరు. అట్టి స్థితిలో "గాండీవం" అనే పత్రికలో వారితోపాటుగా వివక్ష లేకుండా నన్నుగూడ యెవరో వక ప్రాజ్ఞ మహాశయులు విమర్శించి వున్నారు. ఆ వ్రాఁతలో వారి అంతరాత్మ నిజాన్ని గుర్తించి వున్నట్టున్నూ కొన్ని మాటలు కనపడతాయి. కాని అంతకన్న స్పష్టంగా వ్రాస్తేనే కాని సర్వులకున్నూ సులభంగా బోధపడదని వారికి నా విజ్ఞప్తి అసలు యీ వాదమే పనికిరాదంటారా? అలా అనడం కూడా మంచిదే. అచ్చుపడి వున్న యథార్థమైన నా జీవితచరిత్రకు అవమానం వస్తూవున్నది గదా? నిజం తేల్చుకోకపోతే యేలాగ? నిజమైన తప్పేదేనా వుంటే దాన్ని కాదని వాదిస్తే నన్ను మందలిస్తే నేను వప్పుకుంటానోలేదో చూడండి. అలాటిచోట మార్గాంతరం వుంటే దాన్ని చూపుతాను. అది పాండిత్య బలాన్నిచూపేదవుతుందిగాని పిడివాదం లోకి రాదు. యేమైనా మీ "గాండీవ" వ్యాసం చాలావరకు యుక్తంగానే వుంది. మళ్లా వ్రాసేటప్పుడు వివేచనగా వ్రాయండి. యింతే మనవి. -

★ ★ ★