పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/838

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

942

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యెవరేనా ప్రశ్నించవచ్చు. వారికి నేను చేసుకునే మనవి యేమిటంటే : వారు నా నిర్దుష్టమైన ప్రయోగాలు దుష్టాలని ప్రమాదపడి వ్రాస్తే నావి నేను వారి ప్రయోగాలే చూపి సమర్థించుకోవడాన్ని గూర్చి లోకం నా మీఁద లేశమున్నూ ఆగ్రహించదు, యెందుచేత? అది అవసరమైన విషయంకనక. పైపెచ్చు వారి తప్పులు చూపితేనో? ఆ తప్పులు నిజమైన వయినప్పటికీ "గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిం” దంటారు, సరే! లోకానికి వెఱవడంచేతకాని లేకపోతే గురువుగారి భారతంలో దురుద్ధరమైన దోషాలు వున్నాయనే అంటావా? అంటే, అంటాను. మచ్చుకు రెండు మూడు చూపుతాను కూడాను. చిత్తగించండి.

“అఘౌఘదహద్దండకమండలుప్రథితుఁడు,” (శ్రీ-కృ-భా-ఆదిపర్వం-1-4-ఆ)
“సుందరవతి, పురముల్, సరంబులున్” (10 - ఆశ్వాసము)
"సుభగస్నిగ్ధములై మహాయుతములై శోభిల్లు కేశంబులన్” (సభా-4-ఆ)

యిత్యాదులు చాలావున్నాయి. అంత పెద్ద గ్రంథం వ్రాసేటప్పుడు వ్యత్యాసాలు కొన్ని వుండడం ఆక్షేపణీయంకాదు కాని అంత గ్రంథం వ్రాసిన తమరు వకళ్లని ఆక్షేపించడానికి ఆరంభించ గూడదన్నది అందఱికీ సమ్మతమైనమాట. అయితే నీవిప్పుడు చూపిన ప్రయోగాలవల్ల గురువుల వారి ఆక్షేపణలన్నీ కొట్టబడ్డట్టేనా? అని శంక రావచ్చును. అబ్బే! యింకా కొన్ని మిగులుతాయి. యివి వూరికే అవసర నైవేద్యంగా సమర్పించుకున్నాను. మహా నైవేద్యం తరువాయివుంది. యింకా గురువులు నామీఁద చూపే దోషాలున్నూ తరువాయే. గురువులను యిదివఱలో ప్రార్ధించివున్నా మళ్లా కూడా ప్రార్ధిస్తాను. అయ్యా, మీరు నా గ్రంథంలో దోషాలుచూపడానికి మొదలుపెట్టినారు. మీ కవిత్వమే చూపికొన్నిన్నీ భారతాదులు చూపి కొన్నిన్నీ వుపాయంగా సంగ్రహంగా సమర్ధించివున్నాను. విస్తరించి కావలిస్తే దేన్నో తాము నిర్దేశిస్తే దాన్ని గుఱించి యెంత వ్రాయాలో అంతా వ్రాసి తృప్తిపఱుస్తాను. ఆలా అనుగ్రహించకోర్తాను. కోపంకొద్దీ యేదో పెద్దజాపితా వ్రాస్తే పండితలోకానికి దాని మంచిచెడ్డలు తెలుస్తాయికాని సామాన్యుల కేం తెలుస్తాయి? సంగీత పాటకులు యేదో ఒక స్థలంలో జాగాచేసి స్వరకల్పనచేసి లోకాన్ని రంజింపచేసినట్లు మనం కూడా అలా చేదాము. లేకపోతే గ్రంథం మఱీ పెరిగిపోతుంది. యీ వ్యాసంలో నేను చూపినవాట్లల్లో దేన్నో వకదాన్ని నిర్దేశించండని మనవి చేస్తాను.

యింకొక విషయం వ్రాస్తాను, ఫల్గుణ, ఫాల్గుణ, అనే ప్రయోగాలు యెనిమిదింటికి తక్కువకాకుండా తమ ఆది, సభాపర్వాలలో నాకు కనపడ్డాయి. వకటో రెండో నకారఘటితాలున్నూ కనపడ్డాయి. యీ సంగతి నేను వూరికే తమతో మనవిచేసుకోవడం లేదు. కారణం అడిగితే అప్పుడు విస్తరించి మనవి చేస్తాను. తాము "పాపం బద్దలవుతుంది"