పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/832

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

936

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చేస్తూవున్నాను. వారి జాబితాలో వున్న శంకలలో వక్కదానికి “ఏనిని” అన్నదానికి నేనిందు సమాధానాన్ని గూఢంగా సూచించాను. యిప్పటి యుద్ధాలు పూర్వకపు యుద్ధాల మాదిరిని కావని “యిటలీ" యుద్ధమెఱిఁగిన వారికి తెలపనక్కరలేదు. కాబట్టి గూఢమార్గ మవలంబించాను.

గురువులతో శిష్యుఁడెన్నఁడున్నూ యెదుర్కోఁగూడదు. పలువురు గురువుల శుశ్రూష చేసిన శిష్యునకు తుట్టతుద గురువుగారుతప్ప తక్కినవారు లొక్కవడమే తఱుచు తటస్థిస్తుంది. కాని నిజం కనిపెట్టిన గురువులు ఆశిష్యుణ్ణి ప్రేమించి వారి ప్రజ్ఞకు సంతోషిస్తారు. అంతేనేకాని వాణ్ణి అధఃపాతాళం అణగదొక్కడానికి ప్రయత్నించి తద్ద్వారాగా అపకీర్తి వహించరు. ప్రస్తుతం అవసరంలేకపోయినా గురువుగారు శిష్యుఁడి తాలూకు కవిత్వంలో తప్పులంటూ యేకరుపెట్టి శిష్యుణ్ణి అధఃకరించాలని వారికుతూహలం. అందుకోసమే కాలదోషంపట్టిన “ప్రోనోట్లు" కంప్లయంటు చేసినట్లు యెన్నఁడో ఖండింపఁబడ్డ “శతఘ్ని" వగయిరా వాదోపవాదాలు స్వీకరించి ప్రకటించడానికి మొదలుపెట్టినారు. తమ భారతంలో తామేలా ప్రయోగించుకున్నారో, అలా ప్రయోగించిన ప్రయోగాలను కూడా తప్పనడానికి మొదలేశారు. యిది మఱిన్నీ అమాయికత్వం గదా? యిదివఱలో ఆక్షేపించిన ఆయీ ఆక్షేపణలకు మహాభారతాదుల నుంచి ప్రయోగాలిస్తే, అవి సరియైనవా కావా అన్న పరిశీలన లేకుండానే మళ్లా యేవో తప్పులంటూ వ్రాయడం చూస్తే గురువుగారి ధోరణికి అర్ధమే కనపడడంలేదు. మహాకవులు ప్రయోగాలు వుంటేమాత్రం “వాళ్ల కర్మ వాళ్లదీ, మనకర్మం మనదీ” అంటారేమో. వక సందర్భంలో యిదివఱలో యిదేరీతిని అనివున్నారు. కొంచెమేనా ఆలోచించి వ్రాస్తే బాగుండేదేమో? వ్రాతకదా? వట్టిమాటలయితే యేమో అనుకోవచ్చు, వ్రాఁత బలికోరుతుందంటారు. శతంవద, ఏకం మాలిఖ. వ్రాసేదానిలో కొంతేనా నిలవాలా? అంతా పొల్లేనా? గురువులు కొల్లాపురపు పెండ్లిపీటల మీఁది ఆశీర్వచనప్పద్యాలు “తగలఁబెట్టుకొ" మ్మనడాన్ని సమర్ధించుకోవడానికి చేసే ప్రయత్నం మఱీ అమాయికత్వాన్ని ప్రకటిస్తుంది. -

ఉ. పాశుపతాగ్ని హోత్రమున భగ్గున మండి వెలింగి బూదియై
    రాశికి రాక ధూళియుఁ బరస్పరమేళనలేమి బ్రుంగఁగా
    నాశనమయ్యె దానికి వినాశనకాలము మూడి మున్నె మీ
    యాశలతో శతఘ్ని ............................................

అన్న గీరతపద్యాన్ని పుచ్చుకున్నారు గురువుగారు. యీ పద్యం వెం|| రా|| లు మా పాండవాశ్వమేధంమీఁద “శతఘ్ని" అనే దాన్ని ప్రయోగించామని సంతోషిస్తూవుంటే