పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/831

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురువుగారు వట్టి అమాయికులు

935


నిలవదన్నంతలోనే లోకం విశ్వసించదు. కాఁబట్టి అందులోనుంచి కూడా మచ్చుకు వకటి చూపుతాను, ఖండిస్తానుకూడాను. “క. విని సైఁపక యిది యెంతేనిని గ్లిష్టము" అన్నచో, “ఏనిని" అన్నది తప్పన్నారు. భారతంలో తిక్కన్నగారి కవిత్వంలో యిట్లే ప్రాసస్థానంలోనే వుందని మనవి చేస్తూవున్నాను. యెక్కడో చూపాలిగాని అలా గూఢంగా సూచించడం న్యాయం కాదంటారా? ఆమాట గురుముఖతః వస్తే ఆప్రకారమే చేస్తాను. “చూపఱులు” అనే దానికిప్పటికి దొరికినవి ఆఱు ప్రయోగాలు గ్రంథ విస్తరమేమిటికి? గురువులవా రిప్పుడిచ్చిన తప్పుల జాబితాలో రెండు తప్ప తక్కినవన్నీ శుష్కేంధనాలే. ఆ రెండిటిలో వకటి సవరించి చాలానాళ్లయింది. షష్టిపూర్తి ముద్రణంలో చూచుకోవలసి వుంటుంది. యింకొకటి, న్యాయంగా అడిగేవారికయితే నా ప్రమాదమే అని వప్పుకుంటానుగాని, గొప్పకోసం పరాక్రమించే వీరికట్లా వప్పుకొనేది లేదు. బ్రహ్మయ్య శాస్త్రులవారి శుశ్రూషవల్ల కలిగిన ఆయుధబలంవల్ల మార్గాంతరం త్రోక్కి సాధిస్తాను. మళ్లా గురువుల గారి అమాయికత్వ ప్రసంగాన్ని కొంచెం చూపి మఱీ వ్రాస్తాను. -

“ఆచార్యులవారు ఢంకామీఁద దెబ్బకొట్టి 'యేదీర' మ్మని చెప్పుచు నొక్క మహావ్యాసము ప్రచురించినారు. మఱియు నెందఱో యెన్నో విధముల వీరిని వీరి కవిత్వమును గర్హించుచు వచనరూపముగా పద్యరూపముగా వ్రాసియున్నారు..... నేను 'నావాఁ' డను నభిమానంబున నింతవఱ కెప్పుడును కల మాడింపలేదు.”

"శృంఖల" గ్రంథంలో కల మాడించియున్నారని మనవి. దాని కేమి? యిప్పుడుకల మాడించితిరి గదా! జరిగేసందర్భాన్ని ఆలోచించు కొన్నారా? వెంll శాII నిజమైన శక్తికలవాఁడైతే పేరు నిలుస్తుంది గాని వకరి అనుగ్రహంవల్ల నిలిచే పే రెందాఁకా నిలుస్తుందంటాను!

తి|| వెం|| కవులను వారు గర్హించారు, వీరు గర్హించారు. వచనాలతోనున్నూ పద్యాలతోనున్నూ, అని సంతోషిస్తారు గురువుగారు. యెవరూ గర్హించి, గర్హించడానికి తగ్గ ఫలాన్ని అనుభవించకపోతే యీ గడ్డిపరకలకు యింత పేరెందుకు వస్తుందో గురువులే ఆలోచించుకోవాలి. ఈ విషయం “పుణ్యైర్యశోలభ్యతే" అనే వ్యాసంలో చూడలరు. వెంll శా|| శుంఠ, వట్టి శుంఠే, అని లోకానికి తెలపడానికి వాఁడిన కవిత్వాన్ని విమర్శించడానికి పూనుకొని చూపే తప్పులు బొత్తిగా "లోయరు" క్లాసులో వుండే పాండిత్యానికి స్ఫోరకాలుగా వుండడంచేత, “భారతి" యాదృచ్ఛికంగా నన్ను పలికిన నిక్కపు కవిసార్వభౌముడు అన్నమాట గురువుల వారే సమర్థించిపెట్టినట్లవుతుందేమో! “నావాఁడు” అనే అభిమానం యీ రూపేణా ప్రకటించినట్లు నేను సంతోషిస్తూ గురువుగారి అమాయికత్వానికి అనేకవేల నమస్కారాలు