పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/820

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

924

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

చాలును. సుమారు యీయన పద్యాలలో నాల్గవవంతు పుచ్చుకొన్నట్లయినది. యీ విషయం గ్రంథ రూపంగా ప్రకటింపఁబడినప్పుడు యీయన పద్యాలన్నీ ప్రకటించ వలసినవే. మృదువైనపాకం. యుక్తి నైపుణ్యం, వ్యంగ్యమర్యాద, యివన్నీయీయన కవిత్వాన్ని అలంకరిస్తూ వున్నాయి. నేఁటి కవులలో యిట్టి కవిత్వం వ్రాయువారు కొందఱే వుందురనుట అతిశయోక్తికాదు. యీ వాదాం సత్యనిర్ధారణకు తప్ప యితర విషయానికిగా బొత్తిగా పుట్టలేదు. అందుచే గురువుగారు ఆక్షేపించిన శబ్దతప్పులను గూర్చి రెండిటికి మాత్రమే సమర్ధనం కనపరచి వూరుకున్నాను, తక్కినవికూడా అదేరీతిని సాధువులే. అన్యత్ర వాట్లను గూర్చి యెప్పుడో కాదు కొలఁది రోజుల్లోనే వ్రాస్తాను. కాలీన శబ్దాన్ని గూర్చిన్నీ ఉభయపదులగు ధాతువులను గూర్చిన్ని యిదివరకే వ్రాశాను. బహుశః త్రిలింగలో నేఁట రేపట నయ్యది ప్రకటింతును. ఆ యీ విషయాలు వట్టి తిట్టాటవంటివికావు గనుక లోకాని కంతో యింతో వుపకరిస్తాయి. అందుచే వుపేక్షించ వీలుకాక వోపిక లేనప్పటికి యెట్లో వోపిక తెచ్చుకొని వ్రాయడమైనది. ప్రస్తుత విషయాన్ని గురించో యిదివరకే ముగియవలసింది. "కృష్ణ" యెందుకుపేక్షించింది అనే అంశాన్ని “ప్రజాసేవ" చర్చించ వలసింది. ఆమె చర్చించిందికాదు. అందుచేత యీకాస్తా వ్రాశాను కాని లేకపోతే వ్రాయను. యీపైని యెంతో అవసరం వస్తే తప్ప దీన్ని గురించి వ్రాసేదిలేదు. సశేష స్థితిలో గురువుగారి వ్యాసం వుండఁగా పంపే వ్రాఁత కనుక యీ మాట వ్రాయవలసి వచ్చింది. ముగించినట్టే లోకులు భావింతురుగాక.

★ ★ ★