పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/816

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

920

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మనుష్యాధముఁడు వెం||శా|| అనేటందుకు యేదోయేదో ఆప్రసక్తంగా వ్రాయడ మెందుకు? యిదంతా అవిమృశ్యకారిత్వమే. యీ "సరస్వతీ" బిరుదాలు గృహస్థుల లోకన్న సన్యాసులలో విస్తరించివున్నాయి. స్త్రీనామధారి శ్మశానవృక్షమై పుట్టేయెడల ఆముముక్షువులందఱున్నూ అట్టే కావలయును గదా? తిట్టడానికి శాస్త్రప్రమాణ మెందుకు? అన్నిటికన్నా నాకిది మఱీ ఆశ్చర్యం కలిగించింది. మా యింటి పేరు బుద్ధిపూర్వకంగా "చళ్లపిళ్ల" అని వ్రాసి గేలిచేశారు గురువుగారు. నేను చెళ్లపిళ్ల అని వ్రాలుచేయడం శ్రీవారెఱుఁగక కాదుసుఁడీ. యిది కూడా వెం||శా|| అయోగ్యుఁడనడానికి సాధన మనేవారి తాత్పర్యం. అసలు మాయింటిపేరు “చెల్వప్పిళ్ల" చెల్వము+పిళ్ల యెలాగో “చెళ్లపిళ్ల" క్రింద మాఱింది. చళ్లగా పేర్కొన్నారు గురువుగారు. బుద్ధచరిత్రలో వక పద్యాన్ని యెత్తుకుని గురువుగారు మహాబాగా వ్యాఖ్యానం చేశారు. దానిలో “వ్యాకరణ” శుంఠలు అన్నపదానికి వ్యాకరణం మాత్రమే వచ్చి యితరం లేశమున్నూరాని కవులు అని అర్థం వస్తుందంటూ వ్రాసి దానికి వుదాహరణంగా నన్ను చూపి బొమ్మలాట, పగటి వేషాలు, భాగోతం, అంటూ కూడా యేకరు పెట్టి, రెండు “భాగోతప్పద్యాలు చెపితేనే అయిపోయిందా!" అన్నారు గురువుగారు. పోనీ భాగోతం భాగవతం కింద జమ కట్టుకొందామంటే వారి తాత్పర్యానికి భంగం వస్తుందికదా? యిప్పుడు కోపం వచ్చే కాదు, కోపంకొంచెంగా అంకురించి నప్పటినుంచీ శ్రీవారు నా కవనాన్ని గూర్చి యిట్టి ప్రసంగమే చేస్తూన్నట్టు పలువురు చెప్పఁగా వింటూన్నాను. నేను వ్యాకరణం చదువుకోవడం తప్పని తేల్చారు గురువుగారు. వారున్న శతాబ్దంలో వుండడం కూడా తప్పే కనుక యిదివరలో వారు యేకరుపెట్టిన పది తప్పులలోనున్నూ యీ రెండుకూడా చేర్చి పండ్రెండు తప్పులనుకుంటే బాగుంటుందనుకుంటాను. “భాగోతప్పద్యాలు చెపుతాఁడు వెంllశా|| అంటేనున్నూ గురువుల కోపోద్రేకానికి తుష్టి తీరిందికాదు. ఆ పట్లాన్ని మనుష్యాధముఁడంటూ వక బిరుదు అనుగ్రహించారు, బాగుందనుకున్నాను. యీ బిరుదు ధరిస్తే యే కృష్ణగాని, యేశిష్టా పరిమి పండితులుగాని, ఖండనమండనాలకు మొదలెట్టరనుకుంటాను. కాని యీ"మనుష్యాధముఁడే" గురువుగారి కాలికి "పెండేరం" తొడగడం చేత దానికి గౌరవం లేకపోతుందేమో? “యెగఁదీస్తే గోహత్య దిగఁదీస్తే బ్రహ్మహత్య" యీలా విమర్శిస్తే యిప్పుడేకాదు, యెప్పుడు వ్రాసినవిన్నీ గురువుగారి వాక్యాలు నిలవవు. అందుచేత వారియెడల అవిమృశ్యకారిత్వం వకటి అనాదిగా వుండడంచేత దాన్నే వీటికన్నిటికీ మూలంగా పెట్టుకొని శ్రీవారి ప్రవృత్తిని సమర్థించుకోవడం యుక్తం. “ధాష్టీకపంతులు" రచన కూడా యెప్పుడోకాదు డెబ్భైయో పడిలో చేయించిందీ అవిమృశ్య కారిత్వమే. అందులో తిట్లున్నాయనికాదు, నారాయణా! యెంతకోపం వచ్చినప్పటికీ శత్రువే అనుకోండి, ఆ శత్రువుకు వైద్యం మిషతో “పంది పెంట కషాయం” యిప్పించడం