పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

12

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

 లిప్పటికిన్నీ జ్ఞప్తిలో వున్నాయి. గాని యిప్పుడు వ్రాసేదిమాత్రం యిటీవల విన్నదేగాని అనుభవించి జ్ఞాపకముంచుకొన్నదికాదు. అప్పుడు మాగ్రామం జియ్యంగారు వచ్చారని చెప్పకోవడం మట్టుకు జ్ఞాపకంవుంది. నేను జియ్యంగారిని “బియ్యం” గారని వాడినట్లు కూడా జ్ఞాపకంవుంది. యిఁక వ్రాయబోయే సంగతులేవిన్నీ జ్ఞప్తిమీఁద వ్రాసేవికావు. మా తండ్రిగారు వగయిరా లిటీవల చెప్పుకొనేటప్పుడు విన్నవే.

జియ్యంగారంటే, బహుశః శ్రీవానమామల జియ్యంగారైవుండాలి. వీరు శ్రీవైష్ణవపీఠస్థులు. స్మార్తులకు శ్రీశంకరాచార్యపీఠం యేలాటిదో విశిష్టాద్వైతులకు యీ పీఠమున్నూ అలాంటిదే. యిటీవల చాలాభాగము ఆ యీ పీఠస్థుల పవరు తగ్గిందికాని మా చిన్నతనంలో గవర్నమెంటువారి కన్న యీ పీఠస్థులకు తక్కువ అధికారం వున్నట్టు లేదు. వారికి యివ్వవలసిన పాదపూజ సమర్పించకపోతే ఆయాగృహస్థుల యిళ్లల్లో సామాను జప్తుచేయడం వగయిరా అధికారాలు పీఠస్థులకు గవర్నమెంటుతోపాటు వుండేరోజులు నేను కొంచెం ఎఱుగుదును. క్రమంగా మా గోదావరి డిస్ట్రిక్టుకు పీఠమంటూ వుండడమే అంతరించి చాలారోజు లయింది. సుమారు నలభైయేండ్ల దరిమిలాను మా ప్రాంతానికి శంకరాచార్యపీఠం వచ్చినట్టు గాని, పాదపూజ సమర్పించినట్టుగాని నే నెఱుఁగనే యెఱుఁగను. కాని సుమారు పదేండ్లనాడు కాఁబోలును, యెవరో మాంతాచార్య స్వాములవారంటూ మా సమీపగ్రామం జేగురుపాడుకు వచ్చి నాపేర శ్రీముఖం పంపించారు. శ్రీముఖం అంటే గురుపీఠంవారు శిష్యులకుపంపే నోటీసు. దానిమీద నాకు తోఁచిన పాదపూజ పంపించుకొన్నానుగాని తీరికలేని వారి సందర్శనానికి వెళ్లలేదు. మొత్తం చిరకాలాన్నుంచి మా జిల్లాకు పీఠస్థుల సందర్శనం లేకపోయిందన్నది ప్రస్తుతం.

శైవం - వైష్ణవం

వానమామల పీఠస్థులు మా గ్రామం దయచేయడానికి కారణం శ్రీపిఠాపురం రాజావారే. మాప్రాంతం వెలమవారందఱున్నూ వైష్ణవ మతస్థులే. నేను వెంకటగిరి సంస్థానానికి వెళ్లడానికిపూర్వం వెలమవారిలో శైవులున్నారనే సుతరామున్నూ యెఱుఁగను. యీకారణంచేతనే వెంకటగిరి స్టేషనులో వక వెలమదొరగారితో నాకు నిష్కారణంగా పోట్లాట తటస్థించింది. ఆయన చాలా మంచివారుకనుక కాని, లేకపోతే నాకు ఆపోట్లాటలో “తస్యప్రహరణ" మహోత్సవం కూడా జరిగేదే. అసలు కథేమిటంటే, జంగందేవర వేషముతో వకాయన ఆ స్టేషనులో నాకు ప్రత్యక్షమైనారు. ఆయనతో నేను సామాన్యపు జంగాలతోవలెనే మాట్లాడుతూ వున్నాను. ఆయన మంచివారు కనుక మేము వెలమవారం అని చెప్పారు పాపం. కాదు, మీరు జంగాలన్నాను నేను, యెఱుగనప్పుడు నేనేమన్నా, ఆయన యథార్థం