పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/794

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

898

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తీరవలసింది” అంటూ పెద్దస్వరంతో మాటలాడి, నావలెనే జబ్బుస్థితిలో వుండడమే కాకుండా హార్టుజబ్బుకూడా వున్న వారవడం చేత, “యిదేం చిక్కురా భగవంతుండా" అని నేను భయపడేస్థితికి కూడా వచ్చి యెట్లో కొంతసేపటికి భగవదనుగ్రహం వల్ల మరల కుదుటఁబడి క్షేమంగా రాజమండ్రికి దయచేశారు.

వెంకటస్వామి నాయఁడుగారేనా కొంత సూచిస్తే నేనీ ప్రసంగం యెత్తకపోదును. నేను కొలఁది నాళ్లక్రిందట జరిగిన చిరంజీవి వుపనయనానికి విద్యార్థి ద్వారాగా ఆహ్వానమంపినపుడు బెడిదంగా జవాబు చెప్పినారు. అట్టివారిప్పుడు దయచేయడం వల్ల యీ వాదోపవాదాలు ముగింపు చేయడం కూడా వారికి సమ్మత మేమోనని వూహించుకొన్నాను. యిది నా పొరపాటే, వారికి జయం యీ విషయంలో యింకా కలుగుతుందనే పూర్ణమైన విశ్వాసం వున్నట్టు వారి వాక్యధోరణి వెల్లడిచేసింది. కోర్డు సభ కాదని వాదించడానికి సిద్ధంగా వున్నారు. శ్రీవారికొమార్త కవయిత్రి అని నేను వ్రాసిన మా "ముత్తాత" వ్యాసంలో వున్న అక్షరాలు చూపించాను. అదిన్నీ వారు విశ్వసించినట్లు లేదు. యేదో పత్రికలు నింపడమే వారి వుద్దేశం కాని అది నిల్చేదా? నిలవనిదా? అనే చర్చతో వారికి అవసరం లేశమున్నూ వున్నట్టు వారి ధోరణి కనపడడంలేదు. యిఁక వారిని ప్రార్థించిన లాభంలేదు. కాఁబట్టి పత్రికలవారిని ప్రార్ధించి చూస్తాను. అయ్యా పత్రికాధిపతులారా! మీకు కూడా కొంత పరిశీలకత్వం వుండాలా? వద్దా? “దున్నపోతు యీనిందంటే దూడని కట్టెయ్యండి" అనే మోస్తరుగా మీ ప్రకటన వుండవచ్చునా? యెవరినో వకరిని వారి వ్రాఁతనుబట్టి మీ వ్రాత అసంగతంగా వుంది అని మందలించడానికిగాని ఆకారణంచేత మీ వ్రాఁత ప్రకటనార్హం గాలేదని తెల్పుటకు కాని మీకు అధికారం వుందా? లేదా? సహేతుకముగా మీరు యుక్తాయుక్తతలు తెలిపితే కూడా పక్షపాత దోషం తగులుతుందా అని మిమ్ము ప్రశ్నిస్తూ వున్నాను. "వకటేమాట లేక సూక్ష్మోపాయం" అనే శీర్షిక క్రింద నేను శ్రీవారు కోర్టులో చెప్పినమాటలు వుదాహరించి వుంటిని. కోర్టులో చెప్పేమాటలు ప్రమాణం మీద చెప్పేవేకదా, వాటినే కాదంటేయింక గతియేమి? అట్టివారెవరయినా గురువులే కానిండు; యేదో వ్రాసి నాకు వృథాగా పని కల్పించి బాధిస్తూవుంటే తటస్థంగా వుండడం మీకు ధర్మమేనా? ఆ వ్రాఁతలో సారంవున్నట్లు మీకు తోస్తే దాన్నేనా మీరు ప్రకటించండి. నాకు వారు కృతఘ్నత్వాన్ని ఆరోపించి వ్రాశారు ముందుగా "శృంఖలం" అనే పుస్తకంలో. ఆలా వ్రాయడానికి కారణం, నేను వారి ప్రతిపక్షి పండితుఁడికి సదభిప్రాయం యివ్వడ మంటారు గురువుగారు. నే యిచ్చిన మాట సత్యం. ఆ పండితుణ్ణి గురువుగారు ఆడిన దుర్భాషలకు నేను సహించలేకపోయాను. కాఁబట్టి గురువుగారికి వ్యతిరేకమైనా న్యాయమవడం చేత ఆలా అభిప్రాయం యిచ్చాను. దానిమీఁద