పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/793

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

897నేఁడు

(19-3–1936 సం||ర కృష్ణాపత్రిక నుండి)

మిక్కిలీ సుదినమని సంతోషించా లనుకున్నాను. భార్య చనిపోయిన రోజులుగదా యివి! యీ రోజులలో సుదినం యెక్కడి నుండి వస్తుందని నీవనుకున్నావని లోకులు ప్రశ్నింపవచ్చును. వినండి. మంచిలో చెద్ద, చెడ్డలో మంచిన్నీ కలుగుటకూడా అప్పుడప్పడు సంభవిస్తూ వుంటుంది కదా? యీ రెండు అంశాలున్నూ యిప్పుడే నాకు అనుభూతమైనాయి. చి||కుఱ్ఱనికి వడుగున్నూ, చి||సౌ|| పెద్దపిల్లకు శోభనమున్నూ జరిగించి సంతోషిస్తూవున్న సమయంలో భార్యా వియోగం తటస్థించింది. యిది మంచిలో చెడ్డగదా! యిఁక చెడ్డలో మంచేమిటంటే? యీ భార్యా వియోగపు దినాలలో శ్రీ మా గురువులు శ్రీశ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రులవారు నేనింకా నిద్దురమంచము నుండి లేవని పూర్వమే పరామర్శ నిమిత్తం శ్రీయుత బెజవాడ వేంకటస్వామి నాయఁడుగారినిన్నీ గొర్తి సన్యాసిగారనే నా బాల్యమిత్రుఁడుగారినిన్నీ, మఱియొకరినిన్నీ వెంటబెట్టుకొని యీ వేళ దయచేశారు.

పత్రికలలోకాలాలకు కాలాలుగా అవిచ్ఛిన్నంగా యేవోవ్రాఁతలు నడుస్తూవున్న సమయంలో శ్రీవారు నన్ను వోదార్చడానికి రావడం చెడ్డలో మంచిగా నా మనస్సులో తోఁచి శ్రీ నాయఁడుగారున్నూ సన్యాసిగారున్నూ మా యిరువురకున్నూ అత్యావశ్యకులగుటచే యీ విషయం యీ మిషమీఁద ఆగిపోతుందనే హేతువుతో గురువుగారితో కలిసికొని వచ్చివుంటారని నే నభిప్రాయ పడడంలో తప్పులేదు కదా? ఆ కారణం చేత కొంతసేపు ప్రకృతకాలోచితమైన ప్రసంగం జరిగిన తరువాత నేనే, శ్రీ గురువుల పాదములపై శిరస్సుమోపి "అయ్యా, వ్రాఁతలో పరస్పర విరుద్ధాలు పడుతున్నాయి, దీనివల్ల లోకానికి అసత్యము వ్రాసినట్లు తోఁచడానికి అవకాశం కలుగుతూవుంది. జరిగిందేమో జరిగింది. యిఁక దీనినుండి విరమించి లోకానికి సంతుష్టి కలిగించుదాము" అని మనవి చేసుకున్నాను. దానిమీఁద బ్రహ్మాండమైన కోపావేశం తెచ్చుకొని గురువుగారు, "నేను పరామర్శించుటకు వచ్చితినేకాని యిందుకురాలేదు. నీ వ్రాఁతలవల్ల నా భారతానికిన్నీ నా బిరుదులకున్నూ చాలా హానికలిగింది, కొల్లాపురపు పండితుఁడల్లాటివాఁడు యిల్లాటివాఁడు. అతనికి నీవు నాకు వ్యతిరేకంగా అభిప్రాయం యిస్తావా? తప్పైనా వొప్పైనా నా పక్షాన్నే వుండి