పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/787

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దోషావాచ్యా గురోరపి

891


ఆ తెఱలోవుండి వ్రాసేవ్రాతలో ఆయనది తప్పే అని కొంతవఱకు వప్పుకున్నట్లుకూడా వ్రాశారుకదా? ఆ తెరకాస్తా తీసివేస్తే ఆ పద్యాలు తమవే అన్నప్పుడు అందు అలా చెప్పగూడదని చెప్పినమాట స్వయంగా వప్పుకొన్నట్లయింది కాదా? యిఁక విశ్వకర్మ శిష్యుఁడిగారిచేత యేదో అసత్యప్రణాళికను వ్రాయించడ మెందుకు? తామేదో వ్రాయడ మెందుకు? వృథాపరిశ్రమయే కదా! ఆ పద్యాలు పుల్లెల శ్రీరామశాస్త్రుల్లగారివే అంటూరా ? తాము తప్పన్నట్లే నేనున్నూ తప్పన్నాను. అందులో గురువుగారి మార్గాన్నే శిష్యుఁడు పట్టినట్లయిందిగాని వ్యతిరేకించినట్లు లేశమున్నూలేదే. అయితే యిప్పుడు కార్యార్థం, ఆ పద్యాలు వూరికే నామతః శ్రీరామశాస్త్రుల్లుగారి పేరు పెట్టేనేగాని నావే అని గురువుగారు వ్రాస్తూన్నారు. ఆ వ్రాఁతనే ఆక్షేపిస్తూ వున్నారు. కొందఱు పత్రికాధిపతులు, దాన్ని ఆక్షేపించి వూరుకోక వీరెన్నేని అసత్యాలాడతారని కూడా సూచిస్తారు. ఆ సూచన వూరికే పోతుందేమో అంటే పెండ్యాల వారికేసు అచ్చుపడడంచేత వూరికేపోదు. పోనీ అది నాకెందుకు? నాకు కావలసింది మనం వారి కవిత్వాన్ని తిట్టినతిట్లు గురువుగారివే అని వారు వప్పుకుంటూ వున్నప్పుడు నేను వారికి వ్యతిరేకంగా వెళ్లవచ్చునా అనేది మాత్రమే. వారు వెళ్లిన మార్గం మంచిదికాదని వారే వప్పుకుంటూవున్నట్లు వారిస్వంతమాట లుదాహరించానుగదా? వారెంత తప్పుగా వుందని వ్రాశారో అంతకు పదివేలరెట్లు తప్పుగా వుందని నాకుతోఁచింది. లోకానిక్కూడా నాకుతోఁచినట్లే తోస్తుంది అని నేను పూర్తిగానమ్మి ఆత్మవంచన లేకుండా గురువుగారికి కోపం వచ్చినా సరే అని సదభిప్రాయం యిచ్చానే అనండి. యిప్పుడు నన్ను సాధించడానికి మార్గాంతరం లేక సుధీమణి తెఱను దూరంగా తోసివేసి గురువుగారేలా వ్రాస్తూన్నారో!

"శ్రీరామశాస్త్రిగారికిని కొల్లాపురంవారికిని సంబంధములేదు. అందలి విషయమంతయు నన్ను పురస్కరించుకొని యున్నట్లును, నాకురెండు వేల రూప్యములు వనంవారివలన రాకపోయినట్లును, స్పష్టముగా మొదటి పత్రమే తెలుపుచుండినది. అందు మొదటి పంక్తిలోనే నా పేరున్నది........... "

పై అక్షరాలు తెరతీసివేసి గురువుగారు ప్రత్యక్ష మైనారన్నందుకే కాక ధనము చెడినదిగాన ఆ శ్లోకాలు తప్పంటినేకాని లేకపోతే అనేది లేదు అనే అంశాన్ని కూడా వ్యంగ్య మర్యాదచే స్పష్టీకరిస్తూ ఉన్నాయి. దాని మీఁద యింకా లాగితే “యిస్తే... యివ్వకపోతే” అనే సామెతలోకి కూడ డేఁకుతుంది. అందాకా మనకెందుకు, యింకొకమాటకూడా చెరలాటం, లోనుంచి గురువుగారిది యిక్కడ వుదాహరించి పైని అందుకుంటాను. “అది నేను వ్రాసినదని పూర్తిగా తెలియును" అది అంటేయేమి?