పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/784

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

888

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వేంకటశాస్త్రిగారు నాకు శిష్యులని యే సభయందును బలికియుండలేదు.” చెరలాటంలో పై రీతిని వ్రాసి యున్నారుగదా గురువుగారు! దీనికి నా సమాధానం చిత్తగించండి. “చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి నాశిష్యుఁడు, అతఁడు నాయందు పితృవాత్సల్యత చూపుచు......" అనే వాక్యాలు రాజమండ్రి కోర్టులో శ్రీవారు పలికివున్నారు. "పండితాభియోగం" అనే పేరుతో ఆ కోర్టు వ్యవహారమంతా అచ్చుపడివుంది. కోర్టు సభ కాదని గురువుగా రంటారనుకోను. యిదేమోస్తరుగా “శ్రీవారి కొమార్త కవయిత్రికాదు" అని నేను ధ్వనింపఁ జేశానన్న సంగతి కూడా యెగిరిపోతుంది. అలాగే ముక్త్యాలలో శ్రీవారిని గూర్చినేను చేసిన ప్రయత్నానికి మొట్టమొదట తాము సంతోషించలేదన్నదిన్నీ యెగిరిపోతుంది. గ్రంథం పెరగడాని కిష్టంలేక సూక్ష్మంలో మోక్షం కనుపఱుస్తూ వున్నాను. వాది ప్రతివాదులు వకరివ్రాఁతను వొకరు నిరసించడం లోకాచారమే. యిప్పుడు నేను చూపించింది ఆ మాదిరిదే ఆవునో కాదో గమనింప కోరుతాను. వారి ప్రతిపక్షిపండితునికి నేను సదభిప్రాయం యివ్వడమే వారికి నాయందు కోపానికి కారణం అన్నది యిద్దఱమూ వప్పుకుంటూనే వున్నట్టు మామా వ్రాఁతలు స్పష్టపరుస్తాయి ఆ కోపం మీఁద వ్రాసే వ్రాత కనుక యేదో మాదిరిగావుండి గురువుగారు అసత్యం వ్రాస్తూ వున్నట్లు కనుపడినప్పటికీ నేను కేవలం అలా భావించను. 69 వత్సరముల వయస్సులో పూర్వ మెప్పుడో జరిగిన విషయాలు బాగా జ్ఞప్తికిరాక, పోనీ వూరుకుందామంటే స్వతస్సిద్ధమైన కోపం అందుకు అంగీకరింపక వ్రాసేవ్రాఁతకనక నానావిధాల అస్తవ్యస్తంగా వుంటూ వుందని సమాధాన పడతాను. చి|| నా కొడుకు సభకు నన్ను రమ్మని హైదరాబాదువారు కొరితే అనారోగ్యకారణంచేత నేను వెళ్లలేకపోతే ఆ సభలో నా ప్రతిమకు కప్పిన సేలువు వగయిరాలకున్నూ విశ్వకర్మ శిష్యుఁడుగారి సంభాషణవల్లనూ, ఆయన సంరక్షణకు గురువుగారు వ్రాసిన వత్తరంలోని మాఖాంతం వగయిరా ప్రమాదపు వ్రాఁతవల్లనూ, శృంఖలం వల్లనూ వచ్చిన యీ వివాదానికిన్నీ ఆ సేలువులను కారణంగా చూపించే గురువుగారి అమాయికత్వానికి పదివేల నమస్కారాలు. వెం||శా|| “.. కాసుకు గడ్డి తినేవాc" డని ఋజువుచేస్తే సంతోషమే కాని యీ విషయం నాకింత అవసరంకాదు. గాని అవసరమైతే పట్టపగ్గాలుండవు. ఆధారాలు బోలెcడు. ప్రధానాంశం, నేను కృతఘ్నుఁడనా? అన్నది. లోకం దాన్ని పరిశీలించుకోవడానికే ఆయా వ్యాసాలు వ్రాశాను. అవసరమైనప్పుడేదో నిర్ణయించుకుంటుంది. గురువుగారు వ్రాసే వ్రాఁతల సారం తేల్చడానికి వకటి చూపేను. పేరుపెట్టి యింకా దేనికేనా "యేమి చెపుతావు” అని గురువు గారుగాని వేఱొకరుగాని ప్రశ్నిస్తే యిట్లే జవాబు వ్రాస్తాను. యిది సుళువైన మార్గమని నాకు తోఁచి యిలా విన్నవించుకున్నాను.


★ ★ ★