పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/781

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రిగారి "క్షమాపణ"

885


అబ్బిన కవిత్వావధానాలను వారికి కట్టిపెట్టినా నాకు దోష ముండదుగాని అన్యులవద్ద చదివిన చదువును కట్టిపెడితే దోషంరాదా? ఈ సంగ తిదివఱకే వ్రాశాను. నాశిష్యత్వాన్ని వారు నిరాకరించారు. శిష్టావారు దీనివల్ల చాలా లాభం వుందని వ్రాసిన సంగతి గురువుగా రెఱిగిందే. చిట్టిగూడూరి పాఠశాలా విద్యార్థి వకఁడెట్లా వ్రాశాఁడో చూపి యిఁక దీన్ని ముగిస్తాను.

"మీరు శిష్యతన్ లవమును పేరులేదనిన నవ్వరె పిల్లలు గూడఁ జూడ
'కింకవిగజసింహదేశికత' కన్నను నెక్కుడె గండపెండరాల్"

వకటే మాట. ధనంకోసం ప్రయత్నం చేయడం సంసారికి తప్పదు. కుక్కదానం పట్టి కుటుంబం పోషింపమన్నారు కదా. ప్రతిష్ఠకోసం ప్రయత్నిస్తే అది పనిచేయదు. తోడ్పడ్డవాళ్ళే యెక్కడో వున్న మాట వున్నట్లు యేకరువు పెడతారు. దానితో రసాభాసవుతుంది. యీ విషయం బాగా గమనించవలసిన సంగతి. యింకొకటి, అవ్యక్త ప్రసంగంచేసే శిష్యులుంటే మందలించాలి. వాళ్ల సంరక్షణకే యితరులకు వుత్తరాలు వ్రాయకూడదు. అలా వ్రాస్తే అవి తుదకు మెడ మీఁదకి వస్తాయి. గురువుగారు విశ్వకర్మ శిష్యుడి రక్షణకు వ్రాసిన వుత్తరంలో పెండేరానికి సంబంధించిన మాటలు పుచ్చుకొని అక్కడి పత్రికలో యెంతతీవ్రంగా విమర్శించారో గురువు గారు చూడలేదనుకుంటాను. "నేనెవరితోనూ నీ విషయమై తప్పుచెప్పలేదని ప్రమాణం చేస్తాను" అని గురువుగారు వ్రాశారు. విశ్వకర్మ శిష్యుడు తనంతటతానే అవ్యక్తంగా హైదరాబాదులో తాము తనతో చెప్పినట్లు కొన్ని మాటలు ప్రసంగించా డనుకొందమా! అయితే ఆ శిష్యుణ్ణి పదిమంది పెద్దలుగల సభకు పిలిచి నన్ను కూడా పిలిచి క్షీరనీర న్యాయంగా వున్న మాకు తంపిపెట్టితివేమి, అని మందలిస్తే యిప్పుడేనా బాగుంటుందేమో? అయితే అతని మాటల్ని “శృంఖల గ్రంథం" బలపరుస్తుంది గదా? అప్పుడు గత్యంతరమేమి? ఇదిగాక ఆ శిష్యుడిచేత హరికథ వ్రాయించడం, అందులో యెక్కడా చదవని పాణినీయాన్ని అతితేలికగా "పాడినట్లు" వ్రాయించు కోవడం, యివన్నీ లోఁకువకు కారణంకావా? ఆ పాణినీయం యెవరివద్ద “పాడినట్లు" వ్రాయఁబడినదో ఆ మహనీయులను కొంచెము నే నెఱుఁగుదును. నేను తమకు శుశ్రూషచేసే కాలానికి వారు జీవించేవున్నారు. వారివద్దనే తాము పాణినీయం పాడివుంటే యిటీవల చాలాకాలాని కనఁగా రాజమండ్రి నివాసానికి వచ్చిన పిమ్మట పాణినీయం పఠించాలని యేల ప్రయత్నించవలసి వచ్చిందో విచార్యం కాకపోదు. అప్పటి తమ ప్రయత్నం నాకు ధారణలో వుండఁబట్టే, ఇటీవలి చర్యలో ఈ పద్యం వ్రాయఁగల్గితిని.