పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/780

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

884

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


క. లోనెంచి వెనుకముందు ని
    దానించియు సిద్ధమైనదాని నణఁచి రె
    ట్లేనియు నొకటో రెండో
    పై నిలిచెన్ వారిచేతిపట్టు వదలుచున్,

ఇందు కనుకున్నాను. యిందేమేనా పొరబాటుంటే క్షమించండి. తాము శృంఖలంలో వ్రాసిన ప్రకారం, ముక్త్యాల సందర్భమున్నూ పాలకొల్లు సందర్భమున్నూ సమర్ధించ లేకపోతే నేను "సెనగలు తిని చేయి కడుక్కున్నట్లు" యీ గండం లోనుంచి బయటపడి శుద్దుణ్ణనిపించు కుంటానుగాని గురువుగారి కెదురుతిరిగి యథార్థమైనవైనా కొన్ని వాక్యాలు వ్రాసిన పాపం మాత్రం నాకు దాపరిస్తుందని విచారిస్తూన్నాను. అయితే నా మతంలో యేపాపమున్నూ కృతఘ్నత్వాన్ని పోలేదికాదని విశ్వాసం గనుక యీ స్వల్ప పాపం చేశేనా ఆ గొప్ప పాపాన్ని తొలగించు కోవడానికి ప్రయత్నించినట్లు గురువుగారు భావించవలసి వుంటుంది. వారు భారత మాంద్రీకరించినారు కదా? అందు నాళీజంఘుని చరిత్రలో కృతఘ్నత్వాన్ని గుఱించి వ్రాసిన విషయం పూర్తిగా వారి కవగతమే కావున విస్తరింపను. స్వల్ప పాపంచేత గొప్పపాపాన్ని పోఁగొట్టుకోవడానికి శాస్త్రజ్ఞుల సమయం వప్పుకుంటుంది. దాన్నే “కూపఖననన్యాయ" మంటారు. ఈ న్యాయం కొంచెం పాపం చేసి సంపాదించే పెద్దపుణ్యం విషయంలో గ్రంథాల్లో పెద్దలు వాడారు. కొంచె మించుమించుగా నేను దీన్ని ప్రస్తుతానికి ముడిపెట్టేను. అదిన్నీకాక న్యాయానికెవరితో యెవరేనా వివదించడం తప్పుగా దన్నందుకు పరశురామునితో నెదుర్కొని యుద్ధ మొనర్చిన భీష్ముఁడొకఁడు కనుపడుతూ వున్నాఁడు. కాఁబట్టి నాకు అంతగాచిక్కులేదు. అందుచేతనే “ఇటీవలిచర్యలో" ఇట్లు వ్రాశాను.

క గురు వొకచో నపమార్గము
   పొరఁబడియో బుద్ధిపూర్వముగనో త్రొక్కన్
   సరిగాదని శిష్యుఁడు మృదు
   సరణిని తెల్పుటయుఁ దద్‌జ్జ సమ్మతమె యగున్.

గురువుగారు నాకు ప్రధాన సమాధానములో వారి శిష్యత్వమును నే నపలపింపాలనే వుద్దేశంతో వున్నట్లు కొన్ని మాటలు వ్రాశారు. అది లోకం వప్పుకోదు. నా శిష్యత్వం వల్ల వారికి వచ్చే గౌరవం లేక పోవుఁగాక, నేను మాత్రం యితర గురువులతోపాటు వారికి కూడా శిష్యుణ్ణే. యితర గురువుల వద్ద చదివిన చదువును మాత్రం వారిపరం చేయడానికి వప్పుకోలేక పోయాను. నా అంతట నాకు “ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః" అనే న్యాయంచేత