పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/778

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

882

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

మీ రచనని నిరసించేవారి కీలాటి చోట్లు పూర్తిగా తోడ్పడతాయి. వారి నందఱినీ మీరు సర్వం తోటకూరకట్టగా అవివేకులని తోసివేయఁ గలిగినారు. నా కది చేఁతగాదు. రాఁతలోకి దిగనేదిగను, దిగితే ఆసీమాంతం చేసి కాని విడిచేదిలేదు. వోడు వస్తుందంటే, అసలే కలగ జేసుకోను. వకప్పుడు నిజమైన తప్పుంటేకూడా మార్గాంతరంచేత సాధించఁగలను. కాకినాఁడ అవధానంలోని “ఏనా మనూనాకృతి భాసమానం” అన్నదిన్నీ గుంటూరి వివాద సందర్భంలోని, “పశ్యాపశ్య....." వాదమున్నూ, పాండవాశ్వమేధంలోని “మరుద్భూపాలుఁడు" లోఁదిన్నీ ఇవి నా పొరపాట్లే అయినా మార్గాంతరం త్రొక్కి సాధించాను, జయించాను. ఈ బలం నా కెక్కడ నుంచి వచ్చిందనుకున్నారు! గురువుల ఆశీర్వచనం వల్లనే. ఆ గురువులలో బ్రహ్మయ్యశాస్త్రులవారి శుశ్రూషకు నేను వెళ్లకపోయే యెడల నేనున్నూతమవంటి కవినే అగుదును గాని శంకరుఁడు పాశుపతాస్త్రం యిచ్చినట్లు ఆ మహాత్ముఁడు నాకు వ్యాకరణ శాస్త్రాన్ని దయచేశారు. దానిచేతనే ప్రతిసభలోనూ నే ఆడింది ఆటగా, పాడింది పాటగా, సాగింది. తాము వ్రాసినట్లు “శేషం స్వం.......” ఈ స్వల్పకాలంలో కూడా అట్లాగే సాఁగుతుందని నా నమ్మకం. గురుపరంపరలో ప్రధానస్థానం వారికిచ్చాను. అనఁగా శంకరస్థానం వారిది. నాకు తాము, కృపాచార్య స్థానంలో వుండే గురువులు. నా అదృష్టంవల్ల ఆ పదము శ్లేషిస్తూకూడా వుంది. కాఁబట్టి నేనిప్పుడు తాము వ్రాసినట్లు పిచ్చియెత్తినట్లే యెదురు తిరిగినా నాయందు కృపను వదలుకోరని యెఱుఁగుదును. చూడండి యెదురుతిరిగి వ్రాసే వ్రాఁతలో కూడా "ఇటీవలి చర్యలో" యెట్లా వ్రాశానోను!

ఉ. కొంకఁగ నేల చెప్పెదను, కోమలమౌ హృదయంబుతోడ “మా
    వెంకటశాస్త్రికన్నఁ బృథివింగలరే? కవు" లంచుఁ బల్కు ని
    శ్శంకగ మద్గురుం, డటు ప్రశంస యొనర్చెడి దేశికుం డెటో
    సంకుచితాంత రుండగుచు సందియ మందఁ దొడంగె నియ్యెదన్.

ఇది తమ పెండారపు సభాధిపత్యమునకు సంబంధించిన ఘట్టములోనిది. దీనివల్ల యిప్పటికిన్నీమీయందు నాకెట్టి భక్తి వున్నదో తమచిత్తానికే విశదం. పెండారపు సభలోని నా వర్తన తమరెఱుఁగనిది కాదు. నేనేమో తగాయిదా పెడతానని పలువురనుకొన్నారు. తాము కూడా తుట్టతుదకు కాని నా అగ్రాసనాధిపత్యాన్ని అంగీకరించనేలేదు. దీన్ని గుఱించి వ్రాస్తూ భారతిలో యెవరో చాలా చర్చించారు. ఆయన శాస్త్రి అనిమాత్రమే చేవ్రాలు చేశారు, చిత్తగించారో లేదో? వారి వారి వ్రాఁత లుదాహరించాను. ఇటీవలి చర్యలో ఈ పద్యం ఆ ఘట్టం లోనిదే.