పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/772

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

876

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మనుమతం భవతి" కనుక వూరుకుంటే నేను కూడా సమ్మతించినట్లే అవుతుందేమో అని వ్రాయవలసివచ్చింది. యిలా వ్రాసినంత మాత్రఁచేత నిజంగా వున్న కళంకు పోతుందా? పోదు. వ్రాయకపోతే మాత్రం, లేనికళంకు అంటుతుందా? అంటదు. కనుక నా యీ ప్రయత్నం “రక్తేవిరక్తేచ వరే వధూనాం నిరర్ధకః కుంకుమపత్రభంగః" అన్న శ్రీ లీలాశుకుని సూక్తి కుదాహరణమే అయింది. కానివ్వండి. ఆ లీలా శుకుఁడూర కున్నాఁడా? శ్రీకృష్ణునిగానం చేయలేదా? నేనున్నూ శ్రీకృష్ణగానమే చేస్తున్నాను. తప్పేమి? యిందు పునరుక్తికూడా బాధించదు. శేషం వినండి. సోమవారం నర్సాపురం వెళ్లేము. నాcడొక వుపన్యాసం యివ్వడమయింది. కాని సభ్యులంతతో తృప్తిపడక యింకొకటి కావాలన్నారు. మఱునాఁడు కోర్టులో సాక్ష్యముందని చెప్పాను. ఫరవాలేదు మళ్లా సమను చేస్తారన్నారు. వారి మాట తీసేయలేక ఆగి మఱునాఁడు కూడా వుపన్యాసమిచ్చి వారిచేకూడా యించుమించు పాలకొల్లులో వలెనే సమ్మానింపఁబడి సపుత్రకంగా, సచ్ఛాత్రకంగా, సుఖంగా, యింటికి వచ్చాను. కథ కంచి కెళ్లింది."


★ ★ ★