పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/770

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

874

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తాత్కాలికానందమే గాని చిరస్థాయిగా వుండే సంగతులంతగా వుండవని కొందఱు హూణభాషా కోవిదు లనుకుంటూ వుండఁగా విన్నాను. యిది సత్యమే కావచ్చును. నేనేమైనా నిజమైన వుపన్యాసకుణ్ణా యేమిటి? రెండెడ్లబండిక్కట్టే జోడులో వకటిచస్తే ఆ బండివాఁడికి మళ్లా తిరిగి యెద్దు దొరక్కపోతే మిగిలిన యెద్దుతో వంటెద్దు బంటి వ్యాపారాన్ని సాగించినట్లు భగవంతుఁడు నన్ను వుపన్యాసకుణ్ణిగా వుపయోగించు కొన్నట్లనుకోవాలి. కాని, కొద్దిరోజుల నుండి ఆవుపన్యాసానికిన్నీ నా శక్తి పనికిరావడం లేదు.

అది యట్లుండె, వుపన్యాసకుఁడు గానివాణ్ణి వుపన్యాసకుఁడుగా దేవుఁడు మారిస్తే మాత్రం వుపన్యాసకులకుండే మహాలక్షణాలన్నీ పడతాయా యేమిటి? “మాఱు మనువుదాన్ని కట్టుకుంటే మొదటి మొగుడు సోది మొదలెట్టిం" దన్నట్టు నా వుపన్యాసంలో కవిత్వ సందర్భాలు రాక మానవనుకొంటాను. అనఁగా వ్యంగ్యాలూ గింగ్యాలూ తఱచుగా వుంటాయన్నమాట. ప్రస్తుత మేమిటంటే, నా వుపన్యాసంలో యేమాటేనా గురువుగారికి అనుమానం కలిగించిందేమో! నాకు మాత్రం యిప్పటికిన్నీ తెలియనే తెలియదు. గురువుగారు మాత్రం వారితోనూ వారితోనూ అనడమేకాని నాతో యెప్పుడేనా అన్నారు కనుకనా తెలియడానికి. వారెవరెవరితో అన్నారో వారందఱున్నూ గురువుగారితో యేకీభవింపనివారే అని మాత్రం వారివారి వల్లనే విన్నాను. యింతవఱకు విన్నావుగదా. యే మాట వారి కనుమానం కలిగించిందో అది మాత్రం యెందుకు వినలేదంటారేమో! చెప్పిన వారంతే చెపుతూ వచ్చారు. నేనున్నూ అంతే విని వూరుకుంటూ వచ్చాను. తబిసీలుగా తెలుసుకోవలసిన ఆవశ్యకత లేకపోయింది. యెందుచేత? లోకులే సమాధాన పఱుస్తూన్నప్పుడు యీ బాధ మనకెందుకని. యెవరో యెందుకు? శ్రీ యినుగంటి ప్రకాశ రాయనింగారు నిన్న మార్గవశాత్తుగా యెక్కడికో వెడుతూ నా క్షేమం కనుకోవడానికి మా వూళ్ళో ఆగి మా యింటికి దయచేశారు. దయచేసే టప్పటికి నేను కూర్చుని లేచే స్థితిలో లేను. నడున్నొప్పి మిక్కిలి బాధిస్తూ ఉండడంచేత కూర్చుంటే కూర్చుండడమే, పరుంటే పరుండడమే, నిల్చుంటే నిల్చుండడమే అన్నట్లున్నది నా స్థితి. ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానించినట్లవుతుందని యేలాగో వోపిక తెచ్చుకొని వీథి అరుగుమీఁదకు వచ్చి వారితోపాటు కూర్చుని ప్రస్తుతం వ్రాస్తూవున్న "ఇటీవలిచర్య" వినికి చేశాను కూడాను. వినికి చేస్తూండఁగా నాకు హఠాత్తుగా తోఁచిందిగదా; యీ దొరకు మనయందు మిక్కిలీ అభిమానం. స్వయంగా ఆహ్వానించి అన్నవరం దేవుడికి ఆస్థానకవులని పేరు పెట్టియేటా నూటపదాహార్లు చొప్పున సుమారు యిరవై యేళ్లనుండి ముట్టచెప్పడమే కాకుండా, యింకా యెన్నోసార్లు యేదో నిమిత్తం కలిగి నంతనే నూట పదార్లిచ్చి గౌరవించడం అలా వుండఁగా,