పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/769

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా పాలకొల్లు ప్రయాణము

873

ఇక్కడ యింకొక మాట వ్రాస్తాను. పరిచయమన్నది బాగానే అనఁగా గాఢంగానే వున్నప్పటికీ అది దగ్గిఱలోకన్న దూరంగా అయితే గణ్యతలోకి వస్తుంది. దగ్గిఱలోనే అయితే అంతగా పనిచేయనిదిగా వుంటుంది. అంటే అంత లెక్కలోనికి రాకుండా వుంటుంది. ఇంకా నా మనస్సులో వున్న అభిప్రాయం పూర్తిగా రాలేదని నాకనుమానం. వినండి. మనం లండను వెళ్ళేమనుకోండి. అక్కడ మన వూరివాఁడు కాక మనచుట్టుపట్ల వూరివాఁడొకఁ డేదో జాతివాఁడే కనపడతాఁడనుకోండి. వాణ్ణి చూచేటప్పటికి మనకి ప్రాణం లేచివస్తుంది. అదే మన గ్రామ సమీపంలో అయితే వాణ్ణి పలకరించనే పలకరించం. ప్రస్తుతం యీ కోమటిబిడ్డ యానాంవిడిచి వచ్చాక యానాం మనిషిని యీ పాలకొల్లులో చూడడమే తటస్థించలేదనుకొంటాను. నేనీరోజుల నాఁటికి యానాంవాణ్ణి కాకపోయినప్పటికీ పూర్వం యానాం వాణ్ణవడంచేత అతనికి నన్ను చూచేటప్పటికి అపరిమిత సంతోషం కలిగి వుండును. ఆ సంతోషమే ఆయీసభా సందర్భానికి హేతువుకావాలి. అతనికి తోడుగా పనిచేసిన కాపెవరో యిప్పటికిన్నీ నేను తెలిసికోలేక పోయాను. అతఁడు మాత్రం నన్ను చిన్నప్పటినుంచీ యెఱిఁగినవాడిలాగ మాట్లాడేడు. యెన్నో అట్టపుట్టాణాళ్లు వుటంకించాడు. వాట్ల వల్ల కూడా నాకు కాస్తేనా యాదుకు రానేలేదు. అతఁడు సామాన్యమైన గృహస్థు. బీదవాఁడే అని తోఁచింది. యీ సభ సమావేశ పఱచడంలో యానాపు కోమటిగేస్తుకన్న యితని చాకచక్యమే యెక్కువ పనిచేసినట్లు తోఁచింది. యితఁడేం చదువుకొన్నాడో తెలియదు కాని, వాగ్దాటి మాత్రం చాలామంచిది. యితనికి చదువుకొన్నవాళ్లంటే ప్రాణమే. పేరుదాహరించవలసిందే కాని బొత్తిగా జ్ఞాపకం లేదు. సుమా రెనిమిదేళ్ల నాఁటి సంగతి యేం జ్ఞాపక ముంటుంది? నాకీ ప్రయాణమును గుఱించి యీలా వ్యాసం వ్రాసే ప్రసక్తి కలుగుతుందని లేశమైనా తెలిసివుంటే యివన్నీ జ్ఞాపకం వుంచుకొనేవాణ్ణేమో! గురువుగారునేనేమో పాలకొల్లులో ద్రోహం చేసినట్లు వ్రాయడంచేతగదా ఇది వ్రాయడం తటస్థించింది! వారు మాత్రం యీ ప్రసక్తి వూరికే కలిగించారాయేమిటి? నావుపన్యాసంలో బందరు ఫిరంగిలోవలె నానాతుక్కున్నూ దొర్లుతుంది. ఆ వఱదలో యేదో వారికి అనుమానాని క్కారణమైందేమో? నేను అంతో యింతో కవినిగాని వుపన్యాసకుణ్ణి గాననడంలో అసత్యముండఁగూడదు. అవధానాలు మానేసిన తర్వాత నన్నెవరేనా ఆదరించడానికి పూనుకుంటే యేదో వుండాలి కనుక యీ నాటకం పెట్టుకున్నాను. అవధానాలరోజుల్లో నీవు బొత్తిగా వుపన్యాసాలే చెప్పలేదా అంటే, చెప్పేవాణ్ణికాని ప్రధానం కవిత్వానికే గాని అన్యానికి లేదన్నమాట. తిరుపతిశాస్త్రుల్లుగారు స్వర్గస్థులైన తరువాత నేను పూర్తిగా వుపన్యాసకుఁడుగా మఱాను. యింకొకటి, వుపన్యసించి నంత సేపున్నూ సభ్యులు కదలకుండా అల్లరి చేయకుండానే వుండి వింటారు. కాని నా వుపన్యాసంలో