పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/768

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

872

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ఆదివారం శివాలయంలో పెద్దసభ జరిగింది. ఆ సభకు మాగురువు గారున్నూ ఆహ్వానింపఁబడి దయచేసి కొంతసేపు కూర్చుని సభ పూర్తికాకుండానే యేదో పనివుందని కాఁబోలునుచెప్పి బసకు వెళ్లారు. అంతకుముందు విష్ణ్వాలయంలో జరిగిన సభలోఁగాని నాఁటి శివాలయపు సభలోఁగాని గురువు గారికిఁగాని వారి భారతానికిఁగాని వ్యతిరేకించే మాట వకటేనా మాట్లాడినట్టు నే నిప్పటికిన్నీ యెఱుఁగను. ఎందుచేత గురువుగారట్లా వ్రాశారో అనుకుంటూ వుంటాను. అన్నిటికీ కారణం కొల్లాపురపుగాథే అని నా వూహ. గురువుగారేదేనా అపరాధకారణాన్ని నిరూపిస్తే అది సత్యదూరం కానిదే. అయితే, యిచ్చిన వుపన్యాసాన్నిప్పుడేలాగా సర్దుకోలేను గనుక క్షమాపణేనా చెప్పి నిర్దోషుణ్ణి కావాలని యిప్పటికిన్నీ నావూహ, కాలుజాఱితే సర్దుకోవచ్చుగాని నోరుజారితే సర్దుకో రాదుగదా "నోరా! వీపుకు దెబ్బలు తేకే" అని పెద్దలూరికే అన్నారా? వీపుకు దెబ్బలంటే ప్రస్తుతం "యదనంతర" న్యాయంగావచ్చిన అపవాదమే అనుకోండి.

శేషం వినండి, టూకీగానే ముగిస్తాను. సభ పూర్తి అయింది. సేలువులు, నూఱార్లు సత్కరించారు. కొందఱు సంపన్న గృహస్థులు షాహుకార్లు వారివారి గృహాలకు ప్రత్యుత్థానంగా తీసుకువెళ్లి వెలగల నూత్న వస్త్రాలూ, పదులూ యిరవయిలూ రూపాయీలూ, చందన తాంబూలాలూ, తుతాపూరుజాతి మామిడిపండ్లూ యిచ్చి సమ్మానించారు. యీ సమ్మానానికంతకూ కారణం ఆ వైశ్యగృహస్థే, యితఁడాగ్రామంలో వున్న ధనికులలో సహస్రాంశానికేనా పోల్చతగ్గవాఁడు సుతరామున్నూ కాఁడు. యానాంలో నేనుండే రోజుల్లోనైనా నాతో కలిసి మెలసి తిరిగిన వాఁడనుకోవడానికిన్నీ తగిన కారణాలు లేవు. యితని తండ్రి నా యీడువాఁడైతే కావచ్చునేమో కాని యితఁడు కాఁడు. తుద కితని పేరు కూడా నాకు తెలియదు. నా దగ్గఱికి వచ్చినప్పుడు కూడా, నీ పేరేమని నే నడగనే లేదు. యెందుచేత? అతఁడేమో ప్రీతిగా వచ్చి నన్ను పెద్దచుట్టాన్నిగా ప్రత్యుత్థానం చేస్తూంటే నేను “నీ పేరేమి” టని అడగడం బాగుండదని పేరుకూడా నేనడగనే లేదు. యితని తండ్రి పేరు సోమరాజని జ్ఞాపకం. యింటిపేరు మాత్రం మాజేటివారు. పాలకొల్లు లక్షాధికార్లను చెప్పి చెప్పడానికి వల్లకాకపోయింది గాని యానాం షాహుకార్లలో కొంత గణనీయమైన కుటుంబమే. యానామునుంచి పాలకొల్లు రావడాని క్కారణ మేమిటో తెలియదు. షాహుకార్లలో మన ప్రక్కవారెవరేనా కాపురానికి యానాం వెళ్లడానిక్కారణం కలుగుతూ వుంటుంది. అంతేకాని యానాన్నుండి వచ్చేకారణం కలుగదు. కలిగినా అది అప్రతిష్ఠా హేతువుల్లో చేరదు. ఈ కోమటిబిడ్డ వల్ల నాకు పాలకొల్లులో అప్పుడు “యెఱుక పిడికెఁడు ధన" మన్న సామెత తార్కాణం అయింది.