పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/755

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

859


మొదలు పెట్టింది. లోకంలో బోలెఁడు జమీందార్లున్నారు. యితర ప్రాంతాల మాటల్లా వుంచండి, మన ప్రాంతంలోనే అనుకుందాం. ఆ జమీందార్లను ఆశ్రయిస్తే యేదోకొంత లాభం వారివల్ల పొందితే పొందవచ్చు, అదేనా దృశ్యాదృశ్యమే. యిదేమిటి అత్యద్భుత మనిపించింది. అయితేయేమి, నా జీవితంలో మిక్కిలి క్రొత్తగా వున్న విషయం వర్ణించి ప్రకటించనేలేక పోయానుగదా అన్న జిజ్ఞాస నన్ను బాధిస్తూనే వుంది.

అంతటో చి|| రెండవకుఱ్ఱనికి స్వల్పకాలంలోనే శారదాబిల్లు గడబిడలో వివాహం చేయవలసివచ్చింది. నేను శారదాబిల్లుకు జంకే కేవల చాదస్తుల్లో పూర్తిగా చేరేవాఁడను కాకపోయినా, పెండ్లికొడుకులు దొరక్కవెతుక్కునేకాల మవడంచేత, కన్యకలుగల సంపన్న గృహస్థులు బలవంతం పెడితే పదేళ్ల కుఱ్ఱనికి వివాహం చేయడానికి కంగీకరించాను. యీ అంగీకరించడానికి నన్ను లోఁకువచేసి తొందరగా పైఁబడుతూవున్న ముసలితనం కూడా వకకారణం. జాతకచర్యలో టూకీగా ఈ వివాహ విషయం వ్రాశాను. శారదాబిల్లుకు నీ వెందుకు జంకవంటారేమో! నేను రజస్వలా వివాహమే అవసరమైతే దాన్నే చేదామనుకొనే తెగలో వాణ్ణే. ప్రభు శాసనాన్ని బట్టి చేస్తున్నాం గనుక అందువల్ల వచ్చే పాపం మనలను ఘటించదని కూడ నా నమ్మకం. యిదిన్నీ కాక, మన దేశంలో అనాదిగా క్షత్రియులు రాజర్షు లనిపించుకున్నవారు రజస్వలా వివాహమే జరిగించినట్లు తెలుస్తోంది. వాళ్లందఱూ నరకానికి వెళ్లి మనం మాత్రం మోక్షానికి వెడతామా అని కూడా నావూహ. సీతాదేవికి వివాహంనాఁటికి, పదేళ్లు దాటనే లేదనిన్నీ ద్రౌపదికింకా అప్పటికి, అనఁగా స్వయంవరం నాటికి, అయిదేళ్లు నిండలేదనిన్నీ సమర్థించేవారితో వాదించడానికి నాకు వోపికలేదు గాని, నేను మాత్రం మూఢనమ్మకం మీఁద ఆ వివాహాలన్నీ రజస్వలావివాహాలే అని నమ్ముతాను.

ప్రసక్తి సందర్భాంతరములోకి వెడుతూ వుంది. మా కుఱ్ఱనికి వివాహం అన్నది ప్రస్తుతం. ఆ వివాహానికి శ్రీ లక్ష్మీనర్సాపురం జమీందార్లకు ద్రవ్యం నిమిత్తం పద్యాలు వ్రాస్తూ శ్రీ ముక్త్యాలరాజాగారిని గూర్చి యిట్లు వ్రాశాను.

చ. చనుటకు శక్తిచాలమి వెసన్ గరపత్రము లంపినంతనే
    ధనమిడు ఱేఁడులుం గల రుదారులు కొందఱు నాకు, వారిలో
    ఘనుఁడల వాసిరెడ్డికులకాంతుఁడు శ్రీశశిమౌళి యొక్కఁ; డై
    నను నటు వ్రాసి పుచ్చుటకు నామది సిగ్గిలు రామయాంబికా