పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/754

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

858

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నారాయణరావునకున్నూ మిక్కిలి దోస్తే, ఆతఁడు ముక్త్యాల వెళ్లి సంధానం చేస్తానన్నాఁడు. కాని కొంత ఆలస్యం అయింది. అంతలో గురువుగారు తొందరపడి స్వయంగా శ్రీ రాజావారి దర్శనానికి వెళ్లేరు. వారు గౌరవించారు. యేదో జరిగింది. ప్రధానాంశం మాత్రం ఫలించలేదు. మరల నాతో విషయం చెప్పారు. ఉత్తరాలు వ్రాయమన్నారు. వ్రాశాను. జవాబు బెడిదంగా వచ్చిందికాని అనుకూలంగా రాలేదు. స్వయంగా మళ్లా వెడదామంటే అనారోగ్యంచేత వెళ్లలేకపోయాను. యిదే నేను చేసిన తప్పు. ఇదే నా అపరాధం. శ్రీ రాజావారు నా వుత్తరాల కిచ్చిన జవాబుత్తరాలు నేను యెప్పటి కప్పుడు గురువుగారికే యిచ్చాను. అలా కానిచో యిందుదాహరించే వాణ్ణి. యీ సంగతి గురువుగా రెఱిఁగినదే.

ముక్త్యాల రాజావారు, యెవరో వక సన్న్యాసి చాతుర్మాస్య వ్రతార్థంగా తమ గ్రామానికి రాఁగా, దాన్ని నిమిత్తంగా పెట్టుకొని యింత మంది కవి గాయకాదులను రావించి వరుసగా కొన్నాళ్లు భగవదారాధన చేస్తూ కాలక్షేపం జరిపినారని యిది వఱలో వుదాహరించిన పద్యాల్లో చివర సీసపద్యంవల్ల తెలుస్తుంది, కాని అప్పుడాయా యీ పండితులకు శ్రీ రాజావారెట్టి సత్కారాలు చేసినదిన్నీ అందులో తేలదు. అది ముఖ్యంగా వ్రాయవలసిందే. దాతలు లోకంలో బహుమంది వున్నారు కాని యీ దాతృత్వమే వేఱు. ఒక్కొక్కరికి నాలుగేసి నూటపదహార్లు. మూఁడేసి నూటపదహార్లు యీ ప్రకారంగా యిస్తూ, అధమం విద్యార్థిగా వచ్చిన వాడిక్కూడా అర్ధనూట పదహాఱుకు తక్కువకాకుండా యిస్తూ అంతటితో సరిపెట్టక పట్టుదోవతులు మంచి వెలగలవి యిస్తూ, వాటితోపాటు వెలగల సేలంచాపులు గూడా యిస్తూ సమ్మానించడం చూచి, కాస్త గోచీ పెట్టింది మొదలు ప్రతి గ్రహణంతప్ప యెఱుఁగని నేను అత్యాశ్చర్య పడ్డాను. కవిత్వం చెప్పేవాళ్లని, “యేదో అతిశయోక్తి చెప్పేడులే” అంటూ చాలామంది తృణీకరిస్తూ వుంటారుకాని, యిలాటి దాతని గూర్చి చెప్పకపోతే దోషం వస్తుందో రాదో చెప్పండి. అప్పు డందటితో పాటున్నూ నేను కూడా ఆ సమ్మానాన్ని పుచ్చుకొని మాట్లాడక యింటికి వచ్చేశానే కాని యేమిన్నీ నోరుమెదల్పనేలేదు. కాని యిలాంటి మహాదాతను గూర్చి వ్రాయక పోవడం తప్పని మాత్రం మనస్సులో అప్పుడప్పుడు బాధగా వుండేది. ప్రసక్తిలేనివ్రాఁత బాగుండదు గదా!

అలా సుమారు రెండేండ్లు గడిచాయి. అంతలో చి|| మా పెద్దకుఱ్ఱనికి వివాహమున్నూ చిన్నతనికి వుపనయనమున్నూ తటస్థించినవి. యీ శుభకార్యాలకు పరిచయం వున్న అందఱు జమీందార్లతోపాటు శ్రీ ముక్త్యాల రాజావారిక్కూడా వక శుభలేఖ వ్రాశాను. వెంటనే నూట పదహార్లు మనియార్డరు వచ్చింది. రెండిటికీ రెండు నూటపదహార్లని కూడా జ్ఞాపకం. అది మొదలుకొని యీయనకు శుభలేఖ వ్రాయడమంటే భయమేయడం