పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/752

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

856

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నాపనేలేదు. నాధోరణి నాదే. వాది దౌర్బల్యమేకాని వాదదౌర్బల్యముండదు కదా? సుమారు పావుగంట కాలము అదే రీతిని సాగించాను. మాతరఫువారి క్కష్టంగానే వుంటుందిగాని సభ్యులకు చాలా సంతోషంగా వుంది. అట్టి సంతోషమే నేను నాఁడా సభ్యులక్కలిగించకపోతే, ఆఖరు వుపన్యాసకుణ్ణి గనుక నేను, అందఱి ప్రత్యామ్నాయ నాకు “తస్యప్రహరణాలు” తప్పవన్నమాటలో అతిశయోక్తి లేశమున్నూ లేదనుకోండీ. రాజమండ్రిలో శ్రీ వీరేశలింగం పంతులువారి తరువాత చిలకమర్తివారి మీఁదనే నూటికి తొంబదితొమ్మిది మంది కభిమానం. అట్టి చిలకమర్తికవిని కేవలము దురుద్దేశముతో అవమానించడాని కేర్పడ్డసభలో నేనుగాదుగదా నన్ను పుట్టించిన బ్రహ్మదేవుఁడేనా వ్యతిరేకంగా మాట్లాడి మానప్రాణాలలో దేన్నో వకదాన్ని కోలుపోకుండా యివతలికి వస్తాడనుకోవడం కేవలం పిచ్చిగాక మఱేమి?

ప్రకృతం వినండి. తాగుమోతు ప్లీడరులాగా నేను శత్రుపక్షాని కనుకూలించే మాటలు మాట్లాడుతూవుంటే గురువుగారు వగయిరాలు నన్ను తరువాతేనా చీవాట్లు పెట్టకుండా వుంటారా? అందుచేత వారినీ సంతోష పెట్టాలిగదా? అందుకోసం మళ్లా జందేన్నీ మఱో బుజం మీఁద కెక్కించాను. లక్ష్మీనరసింహకవిగారు ఇంగ్లీషులో చేసినంతకృషి సంస్కృతంలో చేస్తే బాగా వుండేదని మృదువుగానే చెపుతూ కొన్ని దురుద్ధరదోషాలు చూపెట్టడానికి మొదలు పెట్టేను. సభ్యుల కంతకుముందు నా మీఁద కలిగిన అనుగ్రహం దానిచేత పోతుందేమో అనుకున్నాను గాని లేశమున్నూ పోనేలేదు. అది అదృష్టం. "బ్రదుకు జీవుఁడా" అని వుపన్యాస పీఠాన్ని దిగేశాను.

ఆ రాత్రి వక పెద్ద సంపన్న గృహస్థింటిలో నేదో గొప్ప విందు. అక్కడికి శ్రీ లక్ష్మీనరసింహంగారున్నూ వచ్చేరు. పలుకరించాను. యీ సభా సందర్భాన్ని ఆయన అదివఱకే విన్నారు. మాటల సందర్భంలో, మీరు నిష్పక్షపాతంగా మాట్లాడేరఁట అని నాతో ఆయన అన్నారు. ఆయన కూడా మంచి ధారణాశక్తిగల కవే కనుక యెవరేనా అడిగితే ఈ సంగతి చెపుతారేమో ఆ యీ సంగతి శ్రీ మా గురువుగారు మొదలైనవారందఱికీ జ్ఞాపకం లోనే వుంటుందని నేనుకుంటాను. ఆ యీ విషయాలన్నీ మ||రా||రా|| నాళం కృష్ణారావుగారేమి, బాలదారి నారాయణదేవుగారేమి, తూ.చా. తప్పకుండా చెప్పఁగలరను కుంటాను. వీరు మా గురువులకు ముఖ్యమిత్రులేను.

యింకా నన్ను గుఱించి గురువుగా రాగ్రహంతో లిఖించిన అక్షరాలు కొన్ని చూపి చదువరులకు విసుగు కలిగిస్తాను, క్షమించండి. "పద్యములని పేరుగాని పద్యములు గావఁటఁ అంతకన్న మిన్నగా దాను వెలిగించిన పద్యములున్నపుడు చూతము.” అంతకన్నంటే యెంతకన్న అనుకున్నారు? వనం సీతారామశాస్త్రుల్లుగారిని తాము దూషిస్తూ