పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/751

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

855


తే.గీ. భరతఖండంబు చక్కని పాడియావు
       హిందువులు లేఁగదూడలై యేడ్చుచుండ
       తెల్ల వారను గడుసరి గొల్లవారు
       పిదుకుచున్నారు మూతులు బిగియఁగట్టి.

ఈ వక్క పద్యంతో సమానమైన పద్యం నేను చెప్పఁగలనో, లేదో, అనుకొంటూ వుంటాను. ఆయన మతాన్ని నేను ప్రేమించేవాణ్ణిగాను. ఆయన కవిత్వాన్ని ప్రేమిస్తాను. ప్రేమించనే అనుకోండి, లోకం నిందించదా? యీ విషయం నే నీవేళ వ్రాసేది కాదని శ్రీ మా గురువుగా రెఱుఁగుదురు. గురువుగారి భారతాన్ని గుఱించి రాజమండ్రిలో గురువుగారి ప్రతిపక్షులు ఆక్షేపించే సందర్భాన్ని సమర్థించడానికి సభ అవడం, దానికి నే నధ్యక్షుఁడుగా వుండడం, కొంత వ్యాసంలో వుటంకించే వున్నాను. ఆ సభ తరవాత మూఁడేసి నెలల కొక్కొక్క సభ చొప్పున పెట్టుకోవడమూ, యేదోవక కవి కబ్బాన్ని విమర్శించడమూ, అని గురువుగారే చాలా ప్రయత్నించి కొంతపని చేశారు. పయికి ప్రయత్న మేలావున్నా అంతరంగంలో చిలకమర్తివారి గ్రంథాలకొఱకే యీ యేర్పాటు.

శ్రీ నాళంవారి సత్రంలో వకనాఁడు పెట్టేరు. బ్ర||శ్రీ|| కాశిభట్ల బ్రహ్మయ్యశాస్త్రులగారే దానికి అధ్యక్షులు. ఉపన్యాసకులో? బ్ర||శ్రీ|| కొంపెల్ల సుబ్బారాయశాస్త్రులుగా రొకరు, పుల్లెల శ్రీరామశాస్త్రులుగారొకరు. మ||రా||రా|| నాళం కృష్ణారావుగా రొకరు, మాగురువుగారొకరు, నే నొకణ్ణి యింతమట్టుకు జ్ఞాపకం వుంది. ఇంకా కొందఱున్నా రనుకుంటాను. నేను తలతిప్పుగావుండి కూడా గురువుగారికి కోపం వస్తుందని వచ్చానుకాని వుపన్యాస పీఠానికి చాలాదూరంలో సత్రపుసావిడిలో వింటూ పడుకున్నాను. ప్రసన్న యాదవాన్ని విమర్శించడానికి వుపన్యాసకులు మొదలుపెట్టేరు. మొదటి నుంచీ సభలో అల్లరి కొంచెం ప్రారంభమయింది. దానితోపాటే అడిచినుకూ పొడిచినుకూకూడా మొదలెట్టింది. తుదకు "గాలీవానా వస్తే కథే మారుతుం” దని అనుకొన్నానుగాని, అలా జరగలేదు. క్రమంగా అల్లరిమాత్రం హెచ్చింది. నన్ను కూడా వుపన్యాసపీఠ మెక్కమని బలవంతం చేశారు. భయపడుతూ భయపడుతూ యెక్కేను. ఎందుచేత? వట్టి అల్లరితో సరిపోయేటట్టు ఆ ధోరణి లేదు. సరే. యెక్కిందే తడువుగా శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహకవి గారి కవిత్వంలో నేఁడుపన్యాసకులు చూపించిన దోషాలలో వకటిన్నీ నిలచేవి కావన్నాను. ఆమాట వినడంతోనే సభలోనుంచి "హియర్, హియర్" అనే మాటలు వినవచ్చాయి. ఈ మాట నేను ముఖప్రీతి కన్నది గాదు. నిజముకూడా అంతేను. గురువుగారు, ఇదేమిట్రా వీఁడీలా మొదలెట్టే డనుకుంటూ వున్నారని వ్రాయనక్కరలేదుగదా? నేను నా ధోరణి