పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/749

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

853


గురువుగా రేం వ్రాసేరో అది ప్రస్తుతం కాదు. నన్ను గుఱించి ముక్త్యాల విషయంలో యేంవ్రాశారో అది యిచ్చట వుదహరిస్తాను.

"చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు.... వీరికి నా యందు అనిర్వ్యాజ మైన ప్రేమ. "అంతేవాసిని నేను గృష్ణకవి కత్యంతమ్ము నాయందు నా-యంతర్వాణికిఁ బ్రేమ మగ్గలము" అని ముక్త్యాలరాజావారి యొద్దఁ బద్యరూపముగాఁ జెప్పియున్నారు. మఱియు ముక్త్యాల రాజాగారితో నా విషయమేమో చెప్పి యేమో చేసినారు. పాలకొల్లువారితో నాకుఁగల భారత సంబంధము త్రెంచుకోవలయునని నాకెంతో ప్రోత్సాహము చేసినారు.”

గురువుగారు వ్రాసిన వాక్యములలో మొట్టమొదటిదిన్నీ తుట్టతుదిన్నీ నేను చేసిన పనులే. నేను వారి శిష్యుణ్ణనిచెప్పిన దసత్యమా? యావత్తు భారతమున్నూ శ్రీరాజావారికే కృతిగా వుండాలనే కోరికతో నేను యత్నించిం దసత్యమా? యింక "ముక్త్యాలరాజావారితో యేమో చెప్పి" అన్నమాట కర్థమేమో విచారించాలి. దీనికి శ్రీవారి విశ్వకర్మ శిష్యుని మాటలు వ్యాఖ్యానప్రాయంగా వున్నాయి. ఆ మాట లుదాహరిస్తే ఆ సూత్రానికర్థం బోధపడుతుంది.

(మ.రా.రా.శ్రీ ఓగిరాల సుబ్బారావుగారి వుత్తరము నుండి)

హైదరాబాదుదక్కన్, 21-8-32.

....ఒక విశ్వకర్మ... నేనును మరికొందరు స్నేహితులును కలిసి యతనితో మాటలాడుచున్న సందర్భమున మీరు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి శిష్యులనియు, అట్లుగానైన యుండియు ముక్త్యాలరాజాగారితో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రులుగారు దుర్మార్గులనియు మొదలగున వేవియో చెప్పి కృష్ణమూర్తిశాస్త్రులుగారు భారతము వ్రాయుటకుగాను పైరాజావారిచ్చు నెలవేతనము నాపుచేయించి మీ గురువులయందు మీరు కృతఘ్నతనుజూపి యుండిరని యొకనేరమును మోపి నిర్భయముగా నన్నాడు......."

ఈ మాటలలో నేమాత్రమున్నూ విశ్వకర్మ శిష్యుని స్వకపోల కల్పితం లేనియెడల గురువుగారి సూత్రమునకిది భాష్యమవుటకు సందేహం లేదు. పాపం, అతఁడేంచేస్తాడు? యేదో గురువుగా రనఁగా విన్నాఁడు, నిజమే అనుకొన్నాఁడు. సొంతమాటలతో యేకరువు పెట్టేడు. ఆఖరికి నేను ముక్త్యాలలో చేసిన ప్రయత్నం “పుణ్యాని కెడితే పాప మెదురైన” ట్లయింది. యిందలి యుక్తాయుక్తములను చదువరులకే విమర్శించడానికి వదిలిపెడతాను. నేను కృతఘ్నత్వాన్ని గూర్చి విస్తారంగా పెనుగులాడి పుస్తకాలు వ్రాసి జీవితంలో చాలాభాగం దానికోసమే వినియోగించిన వాణ్ణవడంచేత “తప్పులెన్నువారు తమ తప్పు లెఱుఁగరు"