పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

844

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అనుకోవచ్చు. మా తిరుపతిశాస్త్రిగారి పెద్దకొడుకు పెండ్లికి నారాయణరావు నా మొగమాటాన్ననుసరించి నూరురూపాయిలు అతని కోరికచే అప్పుగా యిచ్చాడు. తిరుపతిశాస్త్రి రెండువందలకు నోటు వ్రాసి పంపేడుగాని, సందర్భం లేకోయేమో యితఁడు నూఱురూపాయలు మాత్రమే పంపేడు. వడ్డీగాని అసలుగాని పుచ్చుకొనే వూహ యితనికి లేదని వేరేచెప్పనక్కఱలేదుగాని, యిటీవల సందర్భాన్ని బట్టి యిస్తే అసలు మాత్రం పుచ్చుకుందామని వూహ వున్నట్లు తోఁచింది. కాని ఆమాత్రం కూడా జరిగించకుండానే తి. శా.గారు స్వర్గస్థులైనారు. అతఁడు వ్రాసిచ్చిన నోటు కాలదోషం పట్టిన తర్వాత నా వద్దకు నారాయణరావు పంపించాడు. సొమ్ము నిమిత్తమేమో అనుకొని వున్న పరిస్థితులన్నీ వ్రాసి, పంపుమంటే నేను సొమ్ము పంపడాని కభ్యంతరం లేదని వ్రాశాను. అప్పటి కతని స్థితిగతులు చాలా వ్యత్యాసంగా వున్నప్పటికిన్నీ అందుకతఁ డంగీకరించాడు కాఁడు. తర్వాత నేను మా..తి. శాస్త్రి కొడుకుతోకొంచెం నీవుకాలూచేయీ కూడదీసుకొన్న తర్వాత అసలు మట్టుకు అతనికిస్తే బాగుంటుందని చెప్పాను. కాని వానికిట్టి వుద్దేశం వున్నప్పటికీ నెఱవేఱిందేకాదు. అంతలో నారాయణరావు స్వర్గమలంకరించాడు.

రామాయణంలో పిడుకల వేట్లాటన్నట్టు యీ ముక్త్యాల ప్రయాణంలో యితన్ని గూర్చి యింతగా వ్రాయడ మెందుకని చదువరులకు తోస్తుందేమో! యీ నా ముక్త్యాల ప్రయాణానికేకాక ముందు నేనిందులో వ్రాయబోయే మఱోప్రధాన విషయానిక్కూడా యీ నారాయణరావే "కర్ణునితల భారతం" గా వుండడం చేత యింతగా ప్రస్తావించవలసి వచ్చింది. శ్రీ ముక్త్యాల రాజావారు యితని ప్రేరేపణచేతనే ఆయా కవిగాయకాదులను బిలిపించి సన్మానించారు. యితఁడే శ్రీరాజావారికి నన్ను జ్ఞాపకం చేసి రప్పించినవాఁడున్నూ "యేమి? యితఁడు జ్ఞాపకం చెయ్యక పోతే శ్రీ రాజావారికి నీపేరే తెలియదా" అని శంకించకండి. రాజులుగదా! అభియుక్తులేమన్నారు!

శ్లో. అగాధహృదయా భూపా కూపా ఇవ దురాసదః
    ఘటకా గుణినో నోచే త్కథం లభ్యేత జీవనం.

దీనికి ప్రతిపదార్థం వ్రాస్తే చాలా పెరుఁగుతుంది. కొంచెం కఠిన శ్లోకం గనుక తాత్పర్యం వ్రాస్తాను. రాజులున్నూ నూతులున్నూ వకటే మాదిరిగానే చాలా లోతుగా వుండడంచేత, ఘటకులంటే సంధానంచేసే మధ్యవర్తులున్నూ నీరు తోడుకొనే చేఁదలున్నూ మంచిగుణం కలవారున్నూ మంచిత్రాడు కలవిన్నీ కాకపోతే, రాజులవల్ల జీవనం ఆసించే వారికి జీవనమున్నూ నూతిలో నుండి నీరు ఆసించేవారికి నీరున్నూ లభించదని ముఖ్య తాత్పర్యం. యీ నారాయణరావే శ్రీ రాజావారితో మనవిచేసి నన్నక్కడికి రప్పించాడన్నది ప్రస్తుతం,