పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/736

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

840

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


విమర్శగ్రంథ ములకునెక్కి అచ్చయి యెల్లెడల వ్యాపించె. నేనుపేక్షించినచో రేపటి నుండి పత్రికలలో ‘అది నిజమా? ఇది నిజమా? అని వివాదములకుఁ బ్రారంభింతురుగదా! కావుననిది చారిత్రక విషయ మగుటచే నుపేక్షింప వలను పడక కలిగించుకోవలసి వచ్చినది. గురువుగారి “మాఘము వఱకు” అను నక్షరములుగల హైదరాబాదు యుత్తరపు సంగతి నా కిదివఱలో తెలియదు. ఈ రికార్డు సుమారు వారమునాఁడు (ఈ వ్యాస మీ నెల 2వ తేదీని వ్రాయఁబడినది.) నాకడకు వచ్చినది. దురుద్ధరదోషశృంఖలము చూచి రెండు మూఁడేండ్లు దాఁటినది. అదియును దారుణముగనే యున్నను, ఇది దానిని మించినది. అందుచే నుపేక్షింపఁ వీలిచ్చినది కాదు. కావున గురువుగా రన్యథాగా భావింపక లోకులను సంతృప్తిపఱుపఁ గోరినాను. నేను శ్రీవారి గ్రామములో విద్యాభ్యాసమునకై నివసించిన కాలము దాదాపుగ నైదు మాసములే. అప్పటికి పూర్వమే నేను పదకవిత్వము తప్పో ఒప్పో చెప్పుచున్నాను. ఆ కవిత్వమే నన్ను కోర్టు కీడ్చినది. కుఱ్ఱఁ డనుకారణమున యానాం మేజిస్ట్రేటు కేసు కొట్టివేసెను. నేను కవిత్వ లక్షణమేమియు కాటవరములో చదువుకొనలేదు. కాని గురువుగారును, సహపాఠియును చర్చించికొను సందర్భములో వర్గయతి మట్టుకు నా కవగతమైనది. ఆకాలమున కింకను గురువుగారు ధారాళముగా కవిత చెప్పుస్థితిలోనే లేరు. అవధానులు కూడకారు. పిమ్మట అవధానులైనారా లేదా అనునంశము నాకిక్కడ ప్రస్తుతము కాదు. కావున, అవధానమును గూర్చి లేశమును నేను వారి యొద్ద నభ్యసించలేదు సరికదా, వేఱొకరియొద్దఁ గూడ నభ్యసించనేలేదు. అవసరమును బట్టి కాశికి వెళ్లునపుడు, నిడమఱ్ఱు గ్రామములో అవధాని వేషము వేసితిని. ఈ విషయ మన్యత్ర విస్తరింపఁబడినది. ఇఁక నేను కాటవరములో అభ్యసించిన విద్య యొంతవఱకనఁగా....

ఆ.వె. వీరివద్ద నేఁ గుమారసంభవమును
       గొంత, మేఘదూత కొంత, యింత
       వఱకె చదివినాఁడ, వాస్తవంబిది గురు
       వరుని హృదయ మెఱుఁగుఁ బరుఁడు నెఱుఁగు.

అని నిన్న మొన్న వ్రాయుచున్న "ఇటీవలిచర్య"లో మరల ప్రసక్తి కలుగుకతన “సింహావలోకన” న్యాయమున వ్రాయవలసివచ్చి వ్రాసితిని. ఈనా యక్కరములు భ్రాంతి మూలకములనిగాని దురుద్దేశ మూలకములనిగాని శ్రీమాగురువుగారే కాదు, వేరెవరేని విషయ మెఱిఁగిన వారు సప్రమాణముగా ఋజువుచేసి తెల్పునెడల పూర్వము వ్రాసిన నా చరిత్ర పుస్తకములోని యంశములను వచ్చు ముద్రణమునందేని సవరించుకొందును.