పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/735

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీపాదగురువులకడ నా శుశ్రూష

839


వఱకును అచ్చయియే యున్నది. ఇది కూడ సుమారు డెమ్మీసైజు నూరుపుటల వరకుఁ గాఁదగినంత గ్రంథమిప్పటికిఁ దయారైనది. కొల్లాపురపుసందర్భములో, అనఁగా 1930 వ సం!! ప్రాంతమున గురువుగారికి నాయందు పూర్వోక్తకారణముచే విపులమైన ఆగ్రహము కలిగినను, 1932 సం||ము జరిగిన శ్రీ గురువుగారి గండపెండెరపు టుత్సవమునాఁటి నుండి నాయందు నిష్కళంక హృదయముతోడనే గురువుగారు వర్తించుచున్నారు. అయినను నేనిప్పుడు “ఈవడ్లగింజలో బియ్యపు గింజకు" ఇంత వ్యాసము వ్రాయవలసి వచ్చినందులకు మిక్కిలి విచారించుచున్నాను. వ్రాసినను చిక్కే వ్రాయకున్నను చిక్కే ఏమందురా? నాకు సుమారు రెండేండ్లనుండి నోటీసులు వచ్చుచున్నవి. కనుపడలేదని తిరిగి పోవుచున్నవి. ఈ మధ్య సుమారు నెలనాఁడు మరల నోటీసు వచ్చినది. ఈ నోటీసు తప్పక అమలు జరుగునని నాకును తోఁచినది. కాని జాతకరీతిని మాత్ర మిపుడు మారకస్థితి కనుపడదు. అందుచే మరల ప్రయాణ మాఁగినది. ఆ యీ సందర్భము ప్రస్తుతము వ్రాయుచున్న కామేశ్వరీ స్తవములోని యీ పద్యములు తెల్పును.

శా. నాపూర్వుల్ సుళువైన మార్గముననే నాకం బధిష్ఠించి రే
     నేపాకంబుననైన నేమి! జననీ! యీలాగు శుష్కించియున్
     గాపాడంబడుచుంటి, రెండుపయిగాఁ గావచ్చె సంవత్సరా
     లేపింకబ్బునె? జాలమున్ సలుపఁగా నేలమ్మ? కామేశ్వరీ.

శా. ఆహారం బదితగ్గె, దేహబలమా? అంతంతగానుండె నిం
     కూహాపోహల కేమి? కైతమునకే మొక్కింతయుం దగ్గ దు
     త్సాహం, బియ్యది దేహమున్నిలుప శక్తంభౌనె? ఆహారమే
     సాహాయ్యం బిడుఁగాని, తద్రుచి భవత్సాధ్యంబు కామేశ్వరీ.

అది యటులుండె. ఇట్టి స్థితిలో నీ పరిశ్రమమేల? అన్నది ముఖ్యాంశము. ఏమి చేయుదును? పలుచోట్ల నాశక్తివంచన లేక మద్దెల వరుసలు చెప్పికొన్న గురువు దగ్గఱ నుండి పేరు ప్రకటించి కృతజ్ఞతను వెల్లడించితిని. దానికేమి? పోనిమ్ము, ప్రస్తుత విషయము గురువుగారి ప్రకటన ననుసరించి సవరించుకొందమన్నను అచ్చైయుండుటచే వీలుగాదయ్యె గురువుగా రెవరిపేరనో వ్రాయు నుత్తరములో, నేనెవరియొద్దనో తమ శుశ్రూష చాలించిన చాలనాళ్లకు చదువ మొదలిడిన మాఘకావ్యమును తమ వద్దనే చదివినట్లు వ్రాసిరి. ఆ వ్రాఁత అంతతో నాఁగక, రఘువంశ మొకటి తప్ప తక్కిన కావ్యములన్నియు తమ వద్దనే చదివినట్లు లోకమునకు బోధించుచుండె. పోనిమ్మాయుత్తర మెవరికి వ్రాసిరో వారికి మాత్రము తెలియునుగాని అది యితరులకుఁ దెలియదనుకొందమన్న నయ్యది