పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/731

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీపాదగురువులకడ నా శుశ్రూష

835

ఈ పద్యము గీరతవివాద సందర్భములో, వెం|| రా|| లను గూర్చి జగన్నాథస్వామిగారు మందలించుచు వ్రాసినదని స్పష్టమేకదా? ఈయనతో శ్రీ శాస్త్రులవారెపుడో, "ఏదో కొంచెము నా వద్ద చదివినను, అది లెక్కలే" దని ప్రసంగించి యుండవలెను. లేదా, ఆయన యేల వ్రాయును? వీరు గూడ నిప్పుడు సజీవులేకాన సత్యనిర్ధారణపట్ల తోడ్పడఁ గలరు. కొల్లాపురపు గొడవ మొదలు నా యెడలఁ గోపముదయించినను, 1913 సం|| మునకు పూర్వపు సంగతి గదాయిది. శ్రీవారపు డాయనతో నన్నమాటయే, సందియము లేదు.

"మాఘము వఱకు" అనగా భారవి మాత్రమే చదివెనని యర్ధము చెప్పదురేమో? శివ శివా? ప్రతివాది భయంకరం రాఘవాచార్యుల వారి యొద్ద లఘుకౌముదితోపాటు అప్రధానపాఠముగాఁ జదివికొన్న భారవి మూఁడు సర్గములను, పిల్లంక అనంతాచార్యులవారి యొద్ద లఘుకౌముది తరువాయి చదివికొనుచు, పల్లెపాలెములో మధునాపంతుల సూరయగారి వద్ద చదివికొన్న భారవి చతుర్ధ పంచమ సర్గములును కాటవరములో శ్రీ శాస్త్రులవారి వద్దఁ జదివికొన్నట్లు వ్రాయఁగలనా? నేను వ్రాసినచో నాకు పుట్టగతు లుండునా? ఈ కొంపతీఁత వ్రాఁత శ్రీవారి కెందులకుఁ దోఁచినదో, వారెట్లు సమర్థింతురోకాని, నా కుపాయము దోఁపకున్నది. శ్రీవారి యావాక్యమును హైదరాబాదువా రెట్లు విమర్శించి యెంత తీవ్రముగా ఖండించిరో చూడుండు.

(భాస్కరమాలికానుబంధము అను విద్యావిషయిక విమర్శనము నుండి)

“........... చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు తమ యొద్ద కుమారసంభవము మొదలు మాఘమువఱకు చదువుకొనిరనియు, తెనుగు కవిత్వము, అవధానాభ్యాసము తమవద్దనే.. అనియు వ్రాయుట మరింత చిత్రములో చిత్రము. అంతవరకు శుశ్రూష చేయుటకు కనీసము, ఎంత చురుకుదనము గలవానికైనను రెండు సం||ములు సుమారు పట్టును. మఱి తమ గండపెండెర మహోత్సవ సందర్భమున, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు అధ్యక్షులై తమ అధ్యక్షోపన్యాస సమయమున, గొప్ప సంగీతసభలో, 'నేను శ్రీ||కృ|| శాస్త్రిగారి యొద్ద 3 మాసములు శుశ్రూష చేసినాను’ అని యనిరే? అప్పుడు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారేల మౌనముద్ర ధరించిరో అబద్ధమైన నోరెత్తరా? మూఁడు మాసములలోనే పైవిధమగు విద్యయంతయు సంపూర్తి యగునా?........... "

ఈ రీతిగా శంకించినవారికి శ్రీవారేమి ప్రత్యుత్తర మిచ్చిరో తెలియదు. నేను గీరతములో అయిదుమాసములని వ్రాసినాను. గండపెండెరపు సభలో 3 మాసములని పలికినట్లు పై విమర్శకులు వ్రాయుచున్నారు. ఇది నిక్కమే. జగన్నాథస్వామిగారు నాల్గు మాసములని వ్రాసినారు. నా జీవితకాలమునందే పరస్పర భేదములగుపడుచున్నవి చూచితిరా? ఇట వ్యాఖ్యాన మవధరింపుఁడు. నేను శ్రీ శాస్త్రులవారి గ్రామము ప్రవేశించినది